ఏపీలో అధికారంలోకి రావాల‌నే క‌ల‌ను జ‌గ‌న్ నిజం చేసుకున్నారు. అది కూడా ఆషామాషీ మెజారిటీతో కాకుండా. భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. మొత్తంగా 175 స్థానాల్లో 151 సీట్ల‌ను జ‌గ‌న్ కొల్ల‌గొట్టారు. ఇలా భారీ మెజారిటీ రావ‌డం ఒక‌ర‌కంగా బాగానేఉన్నా.. మ‌రోర‌కంగా మాత్రం జ‌గ‌న్‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీని ముందు నుంచి ఆద‌రించిన నాయ‌కులు ఇప్పుడు జ‌రిగిన‌తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. వీరిలో రోజా వంటి కీల‌క నాయ‌కురాలు కూడా ఉన్నారు.అ దేవిధంగా అనేక మంది నాయ‌కులు ఉన్నారు. కొంద‌రు ప్ర‌త్య‌క్షంగా, మ‌రికొంద‌రు ప‌రోక్షంగా కూడా పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్నారు. 


ఈ నేప‌థ్యంలో దాదాపు 51 మంది రెడ్డికుల‌స్తులే తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. జిల్లాల‌కు జిల్లాల‌ను క్లీన్ స్వీప్ చేసేశారు. వీరిలో జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు కూడా ఉన్నారు. మ‌రి వీరంద‌రికీ న్యాయం చేయ‌డం అనేది జ‌గ‌న్‌కు త‌ల‌కుమించిన భారంగా మారిపోయింది. ఇక‌, ముఖ్య నేత‌ల్లో..  ఆర్కే రోజా రెడ్డి, రాయచోటి శ్రీకాంత్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటి వైసీపీ నేత‌లు ఉన్నారు. వీరిలో కొంద‌రికి గ్యారెంటీగా మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని అనుకున్నారు. కానీ, వారికి వారి సామాజిక వ‌ర్గ‌మే అడ్డు రావ‌డం గ‌మ‌నార్హం.


గ‌తంలోనూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో కేబినెట్ బెర్త్ కోసం.. సీనియ‌ర్లు ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా కూడా వారికి చోటు ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌గ‌న్ కూడా కొంద‌రిని ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌లేదు. వాస్త‌వానికి ప్ర‌భుత్వంలోకి రాక‌పోయి ఉంటే.. అదో స‌మ‌స్య‌గా ఉండేది. ఇప్పుడు ప్ర‌భుత్వంలోకి వ‌చ్చి కూడా జ‌గ‌న్‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. త‌న‌కు మంత్రి వ‌ర్గంలో బెర్త్ ల‌భించ‌క పోవ‌డంతో ఇప్ప‌టికే న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్‌బ్రాండ్ రోజా.. అలిగి నియోజ‌క‌వ‌ర్గం వెళ్లిపోయారు. 


అదేవిధంగా చాలా మంది నాయ‌కులు కూడా మంత్రి వ‌ర్గ ప్ర‌మాణా స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. దీంతో ఇప్పుడు జ‌గ‌న్‌కు అధికారంలోకి వ‌చ్చి, మెజారిటీ స్థానాల్లో విజ‌యం సాధించి కూడా త‌ల‌నొప్పులు అనుభ‌వించాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. జ‌గ‌న్ మాత్రం ప్ర‌తి ఒక్క‌రికి అవ‌కాశం ఉంటుంద‌ని.. రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్పుడు అవ‌కాశం రాని వారికి ఛాన్స్ ఇస్తాన‌ని చెపుతూ ముందుకు వెళుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: