చంద్రబాబునాయుడు తన అవసరాల కోసం అడిగిన ప్రజా వేదికపై వైసిపి కన్ను పడింది. కరకట్టపై నిర్మించిన ఓ అక్రమ కట్టడంలో చంద్రబాబు సిఎం హోదాలో ఐదేళ్ళ పాటు కాలం గడిపేశారు. సదరు అక్రమ కట్టడాన్ని కూలగొట్టాలని ముందు ఇరిగేషన్ శాఖ నోటీసులు  కూడా ఇచ్చింది. అయినా సరే దానిపై చంద్రబాబు కన్ను పడగానే ఐదేళ్ళు అందులోనే గడిపేశారు.

 

విచిత్రమేమిటంటే తానున్నదే అక్రమ నిర్మాణమైతే దాని పక్కనే ప్రజావేదిక పేరుతో మరో అక్రమ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఒకటికి రెండు అక్రమ కట్టడాలు వెలసాయన్నమాట. ఒకటి ప్రైవేటు వ్యక్తులు నిర్మించుకుంటే రెండోది ప్రభుత్వమే స్వయంగా చేసిన అక్రమ నిర్మాణం. ప్రభుత్వంతో అక్రమ నిర్మాణం చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.

 

సరే ప్రస్తుత విషయానికి వస్తే ప్రభుత్వం నిర్మించిన అక్రమ నిర్మాణం ప్రజావేదికను పార్టీ అవసరాల కోసం వాడుకోవాలని వైసిపి నిర్ణయించుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరి ఎల్వీ సుబ్రమణ్యంకు వైసిపి అధికారికంగా లేఖ రాసింది. ప్రజా వేదికను పార్టీ సమావేశాలు, వైసిపి ప్రజా ప్రతినిధుల సమావేశాలకు వాడుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడుకోవాలని నిర్ణయించినట్లు తన లేఖలో వైసిపి చెప్పటం గమనార్హం.

 

తానుంటున్న అక్రమ కట్టడంతో పాటు ప్రజావేదికను కూడా వాడుకునేందుకు తనకు కేటాయించాలంటూ చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఆ లేఖపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ లోగానే చీఫ్ సెక్రటరీకి వైసిపి నుండి లేఖ రావటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. బహుశా ఏ పార్టీకి ఇవ్వకుండా మొత్తాన్ని కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు.

 

కరకట్టపై సుమారు 30కి పైగా అక్రమ కట్టడాలను గతంలో ఇరిగేషన్ శాఖ గుర్తించింది. వాటన్నింటిని కూల్చేయాలని వాటి యజమానులకు నోటీసులు కూడా ఇచ్చింది. కొందరు యజమానులు నోటీసులు తీసుకోవటానికి నిరాకరించారని భవనాలకే నోటీసులను అంటించేసింది. అయితే వాటిల్లోని ఓ భవనంపై చంద్రబాబు మనసు పారేసుకోవటంతో  దాన్నే సిఎం క్యాంపాఫీసుగా ఏర్పాటు చేసింది. దాంతో మిగిలిన అక్రమ కట్టడాల జోలికి  ప్రభుత్వం వెళ్ళలేదు. మరి ఇపుడు జగన్ ఏమి చేస్తారో  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: