రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలుపుపై టిడిపి ఆశలు వదిలేసుకోవచ్చనే అనిపిస్తోంది. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి టీం తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ఎన్నికల్లో మళ్ళీ వైసిపినే విజయ ఢంకా మోగించటం ఖాయమనే అనిపిస్తోంది. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు నచ్చటంతొ పాటు అమలు చేస్తాడన్న నమ్మకం కూడా ఉండటంతో జనాలు వైసిపికి అఖండ విజయం కట్టబెట్టారు.

 

అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు అన్నీ విధాలుగా ఘోర వైఫల్యాలను మూట కట్టుకోవటంతో జగన్ పైనే  జనాలందరూ ఆశలు పెట్టుకోవటంలో తప్పేమీలేదు. దాంతో చరిత్రలోనే ఎప్పుడు లేనంతగా టిడిపి 23 సీట్లకు పరిమితమైపోయింది. సరే వీటిల్లో కూడా ఎన్ని మిగులుతాయన్నది వేరే విషయం అనుకోండి అది వేరే సంగతి.

 

భేటీ అయిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే జగన్ టీం తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే జనాలు వైసిపికి కాకుండా టిడిపికి ఎందుకు ఓట్లేయాలని ఆలోచించటం ఖాయం. ఎందుకంటే, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు జగన్ కార్యరూపం ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలో చంద్రబాబు ఆలోచిస్తే తన మాటను ఎలా నిలుపుకోవాలో జగన్ చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్.

 

రైతులు, డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్, నిరుద్యోగ యువత, అంగన్ వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు క్యాబినెట్ శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 15 నుండి రైతు భరోసా అమల్లోకి వస్తోంది. అంటే దీనివల్ల 56 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగబోతోంది. నిరుపేద మహిళల పేరుతోనే వచ్చే ఉగాది నుండి ఇంటి స్ధలా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు.

 

అలాగే 4 లక్షల వాలంటీర్ల నియామకానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటం, సిపిఎస్ రద్దుకు కూడా క్యాబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది.  అంటే ఒకేసారి ఇటు పట్టణ అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేట్లు జగన్ చర్యలు తీసుకుంటున్నారు. తొందరలో జరగబోయే మున్సిపాలిటీలు, జడ్పిటిసి, ఎంపిటిసిలతో పాటు పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాలని చంద్రబాబు పిలుపిచ్చారు. చూడబోతుంటే జగన్ తీసుకునే నిర్ణయాలతో చంద్రబాబుకు మరో షాక్ తప్పేట్లు లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: