సామాన్యుడికి ఇంకో షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ప‌న్నులు, బ్లాక్ మ‌నీ పేరుతో మ‌న జేబుపై గురి పెట్టింది. పాత పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంపై యుద్ధాన్ని మొదలు పెట్టిన కేంద్రం.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరెన్సీ వినియోగం తగ్గేలా విస్తృతంగా చర్యలు చేపడుతున్న సంగతీ విదితమే. ఇందులో భాగంగానే బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఇక ఏడాదికి రూ.10 లక్షలు మించి నగదు ఉపసంహరణలు చేసినైట్లెతే పన్నులు వేయాలని యోచిస్తోంది. తద్వారా నల్లధనంపై ఉక్కుపాదం వేసినట్లు, డిజిటల్ లావాదేవీలకు ఊతం ఇచ్చినట్లూ అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. తక్కువ మొత్తాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న భౌతిక లావాదేవీలు నల్లధనానికి ఆస్కారమిస్తుండటం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుండటంతోనే నగదు ఉపసంహరణలకు పరిమితి తీసుకురావాలని ప్రభుత్వం చూస్తున్నది. రాబోయే బడ్జెట్‌లో ఈ మేరకు ఓ ప్రకటన రావచ్చని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.


అధిక మొత్తంలో జరిగే అన్ని నగదు ఉపసంహరణలకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదననూ కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల సదరు వ్యక్తుల గుర్తింపు సులభతరమవుతుందని, ట్యాక్స్ రిటర్నులనూ పోల్చుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే రూ. 50,000లకుపైగా డిపాజిట్లకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను ఇవ్వాల్సి వస్తున్నది. ఇప్పుడు విత్‌డ్రాలకు ఆధార్ నెంబర్‌ను ఇచ్చేలా చేస్తున్నారు. కాగా, ఆధార్ సంఖ్య దుర్వినియోగం కాకుండా వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)తో రక్షణ కల్పించే వీలుందని అధికారులు చెబుతున్నారు. నిజానికి ఏటా రూ.10 లక్షలకుపైగా నగదు ఉపసంహరణలతో చాలా వరకు వ్యక్తులు, వ్యాపారులకు అవసరం ఉండదన్నది ప్రభుత్వ అభిప్రాయం. దీంతో ఆపై లావాదేవీలకు పన్నులు వేయడం సబబేనన్న అభిప్రాయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే పేద, మధ్యతరగతి వర్గాలపై ఎలాంటి పన్నుల భారం పడకుండా నిర్ణయాలుండాలన్నదే ప్రభుత్వ అభిమతమని వారు స్పష్టం చేస్తున్నారు. 


ఈ నిర్ణ‌యం వెనుక ఏపీ  మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యం ఉంద‌ని తెలుస్తోంది. 2016లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి ముఖ్యమంత్రుల కమిటీ.. రూ.50,000లకుపైగా నగదు ఉపసంహరణలపై పన్ను వేయాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ వినియోగం తగ్గింపునకు పలు సూచనలనూ చేసింది. నల్లధనంపై ఏర్పాటైన సిట్ కూడా నగదు లావాదేవీల కోతకు పలు సిఫార్సులు చేసింది. అయితే ఇవన్నీ కూడా అమల్లోకి రాలేకపోయాయి. నిజానికి పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగినా.. కరెన్సీ చలామణి పెరుగడంతో తగ్గిపోయాయి. ఈ క్రమంలో మోదీ సర్కారు మళ్లీ డిజిటల్ లావాదేవీలను పెంచడానికి నగదు లావాదేవీలపై పరిమితులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నది.కరెన్సీ వినియోగాన్ని తగ్గించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం ఇటీవల నెఫ్ట్, ఆర్టీజీఎస్ బదిలీలపై చార్జీలను రద్దు చేసింది. కేంద్రం సైతం డిజిటల్ లావాదేవీలపై ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నది. అయినా డిజిటల్ చెల్లింపులుండగా.. ఎందుకు రూ.10 లక్షలకుపైగా నగదు ఉపసంహరణలు చేయాలని పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. 


వచ్చే నెల 5న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నది తెలిసిందే. దీంతో ఈ సందర్భంగా దీనిపై ఓ స్పష్టత వచ్చే వీలుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) లబ్ధిదారులు కూలీ పొందాలంటే ఆధార్ అవసరం అవుతున్నది. కానీ రూ.5 లక్షలు ఉపసంహరించుకున్నవారికి మాత్రం ఆధార్ అక్కర్లేదు. ఏమిటీ విధానం అని కేంద్ర ఆర్థిక శాఖలోని ఓ ఉన్నతాధికారి ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: