'' కలెక్టర్‌ సారూ, ఎండలకు తట్టుకోలేక పోతున్నాం. ఆసుపత్రిలో పిల్లలు వేడికి విలవిల లాడుతున్నారు.
చచ్చిపోయేలా ఉన్నారు... మీరే కాపాడండి..?'' అని కొండప్రాంతపు గిరజనులు మొర పెట్టుకున్నారు. 

అప్పుడే ఆ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్‌కి ఏం చేయాలో అర్ధం కాలేదు. పిల్లలకు ఏమైనా అయితే తను మొదలు పెట్టిన మంచి కార్యక్రమం ఆగిపోతుందేమోనని ఆందోళన పడ్డాడు. ఇపుడు కొత్తగా కూలర్లు కొని అసుపత్రిలో పెట్టాలంటే టెండర్లు, వగైరా చాలా కాలం వృధా అవుతుంది.. కానీ వారి సమస్యను ఎలాగైనా తీర్చాలి అనుకున్నారు ఆ యువ కలెక్టర్‌. 


మనసుంటే మార్గం ఉంటుంది కదా...

వెంటనే తన ఛాంబర్‌లోని ఏసీని తీసుకు పోయి , ఆసుపత్రిలో బిగించమని తన సిబ్బందికి చెప్పారు. ఒకే ఒక్క రోజులో మారుమూల గిరిజన ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో ఏసీ బిగించడం జరిగిపోయింది. తనదే కాక కలెక్టరాఫీసులో ఉన్న మరో మూడు ఏసీలను కూడా అసుపత్రికి తరలించాడు.
 కలెక్టర్‌లోని మానవత్వాన్ని చూసిన కలెక్టరేట్‌ సిబ్బంది ఒక వారం జీతాన్ని ఆసుపత్రి కోసం విరాళంగా ఇచ్చారు.

 దేశమంతా జేజేలు చెబుతున్న ఆ ఐఏఎస్‌ పేరు స్వరోశిష్‌ సోమవంశీ, మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాకు కలెక్టర్‌.
 అక్కడి గిరిజన తండాలలో, మూఢ నమ్మకాలతో ఆకు పసర్ల వైద్యంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న గిరిజనులను కాపాడడానికి 'ఆపరేషన్‌ సంజీవని' అనే కార్యక్రమం ద్వారా శాస్త్రీయ వైద్యాన్ని అందించడం మొదలు పెట్టి నపుడు ఈ పిల్లల ఆసుపత్రి సమస్య ఎదరైంది. వారిని కాపాడక పోతే తను చేపట్టిన కార్యక్రమం ఆగిపోతుందనే ఆలోచనతో తన ఏసీని పిల్లలకు ఇచ్చి తను ఫ్యాను కింద ఉద్యోగం చేసుకుంటున్నాడు.

 ఇలాంటి నిబద్దత కలిగిన అధికారులు జిల్లాకు ఒకరుంటే , సమస్యలు తీరి ,సమాజం మారదా ..?


మరింత సమాచారం తెలుసుకోండి: