ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసిపి అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి  తాను ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలతో మేధావుల ప్రశంసలు సైతం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన 25 మంది మంత్రులతో ఆయన ఆయన కేబినెట్ ఏర్పాటయింది. అందరి అంచనాలకు భిన్నంగా జగన్ తన కేబినెట్ ను ఏర్పాటు చేశారు. కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావించిన చాలా మందికి మొండిచేయి ఎదురైంది. అయితే అనూహ్యంగా తనకు ఖ‌చ్చితంగా కేబినెట్‌లో బెర్త్ రాదని ఓపెన్‌గానే చెప్పేసిన బంద‌రు ఎమ్మెల్యే పేర్ని నాని ఇలాంటి వాళ్లకు సైతం మంత్రి పదవి లభించింది. జగన్ సామాజిక, ప్రాంతీయ ఈక్వేషన్లు చుసిన వాళ్ల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.


ఇదిలా ఉంటే వైసీపీ నుంచి కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు చాలామంది ఉన్నారు. అయితే వీరిలో ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్లకు సైతం మంత్రి పదవి దక్కలేదు అంటే జగన్ కేబినెట్ కూర్పు ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతోంది. జగన్ కేబినెట్ ఏర్పాటు అయింది. తొలి కేబినెట్ భేటీ కూడా ముగియడంతో ఇప్పుడిప్పుడే మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారు తమ అసంతృప్తిని బయటకు వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే రోజా, అంబటి రాంబాబు లాంటి వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయగా జగన్ స్వయంగా వాళ్ళను బుజ్జగించారు. ఇక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్లు అయితే రెడ్డి కులంలో పుట్టిన వాళ్ల‌ల్లో చాలా మందికి మంత్రి ప‌ద‌వులు రాలేద‌ని ఇత‌ర కులాల్లో పుట్టినా స‌రిపోయేద‌ని కాస్త వ్య‌గ్యంగానే వ్యాఖ్యానించారు. 


అతటితో ఆగని రాంభూపాల్ రెడ్డి మరో రెండు సంవత్సరాల వరకు తాను మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూనే ఉంటా అని కూడా చెప్పారు. ఇక జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ కు సైతం మంత్రి పదవి రాకపోవడంతో ఈ ఇద్దరు నేతలు అనుచరులు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఇక ఎస్టీ సామాజికవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్న తెల్లం బాలరాజు, పీడిక రాజన్న దొర లాంటి వాళ్లతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్లు సైతం నిర్వేదంతో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ మాత్రం ఆశావహులు నిరాశ చెందకుండా రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని, అప్పుడు సీనియర్లకు, తాను మాట ఇచ్చిన ప్రతి ఒక్కరికి మంత్రి పదవి ఇస్తానని సర్ది చెబుతూ వస్తున్నారు. 


ఇక మంత్రివర్గంలో నెలకొన్న అసంతృప్తి వార్తలపై పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా స్పందించారు. జగన్ కేబినెట్ కూర్పుపై కొంత మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని కూడా ఆయన చెప్పారు. ఇక జగన్ ఏర్పాటుచేసిన మంత్రివర్గ కూర్పుపై రాష్ట్రంలోని సగటు పౌరుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇక నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డికి జగన్ తన కేబినెట్‌లో కీలకమైన ఐటీ శాఖ కట్టబెట్టిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: