తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు అవుతోంది. కేసీఆర్ రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కూడా మంత్రివర్గం ఏర్పాటు కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. లోక్‌స‌భ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్‌ను పూర్తిగా విస్తరించాలని ప్రణాళికలు వేసుకున్నారు. కేసిఆర్‌కు తెలంగాణ ఓటరు లోక్‌స‌భ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు ఇచ్చాడు. ఖ‌చ్చితంగా 16 సీట్లు గెలిచిన కేంద్రంలో చక్రం తిప్పుతామని భావించిన కేసిఆర్ ఆశ‌లు పూర్తిగా రివర్స్ అయ్యాయి. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కేసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో చిత్తుగా ఓడారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు అయిన బోయినపల్లి వినోద్ కుమార్ సైతం కరీంనగర్‌లో ఓడిపోయారు. 


ఇక బిజేపికి ఏమాత్రం పట్టు లేని ఆదిలాబాద్ ఇలాంటి నియోజకవర్గంలో సైతం బీజేపీ జెండా ఎగరటం టిఆర్ఎస్ వర్గాలకు ఏమాత్రం మింగుడు పడటంలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీలో ఉండకూడదని కేసీఆర్ కావాల‌ని మరీ ఓడించారో.... ఆ నేత‌లంతా ఈసారి ఎంపీలుగా గెలిచి కేసిఆర్‌కి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కిష‌న్‌రెడ్డి లాంటి వాళ్ళు ఇందుకు ఉదాహరణ. ఉప ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న కేసీఆర్ త‌న కేబినెట్‌ను విస్త‌రించే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ పూర్తిగా కేబినెట్‌ను విస్తరిస్తారా ? లేదా అన్న దానిపై క్లారిటీ లేకపోయినా టిఆర్ఎస్ ఇంటర్నల్ చర్చల ప్రకారం నలుగురికి అయితే మంత్రి పదవులు ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జంప్ జిలానీలే ఉండబోతున్నారు.


కేసీఆర్ తొలిసారిగా కేబినెట్‌ను ఏర్పాటు చేసినప్పుడు హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున‌ చర్చలు నడిచాయి. తాజా లోక్‌స‌భ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణమని.... హరీష్‌ను పక్కన పెట్టడం చాలా మంది సామాన్య జనాలకి నచ్చలేదని అభిప్రాయం బహిర్గతమైంది. ఈ క్రమంలోనే హరీష్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో ఇక ఆలస్యం చేయకూడదని కేసిఆర్ భావిస్తున్నారట. కేటీఆర్‌ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా ఆయనకు పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. దీంతో సహజంగానే మంత్రులపై సైతం ఆయన ఆధిపత్యం కనిపిస్తోంది. హరీష్ ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నారు. 


తాజా విస్తరణలో హరీష్ రావుతో పాటు కేటీఆర్,  కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మహిళా కోటాలో సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వనున్నాడట. ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేరు కూడా కేబినెట్‌లో వినిపిస్తోంది. వనమా గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో పార్టీ మారి మరోసారి ఆయన మంత్రి పదవి రేసులో నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: