ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రైతులు ధర్నాకు దిగారు. అయితే ఈ ధర్నాలో రైతులతో పాటు స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే పాల్గొనడంతో స్వయంగా సీఎం జగన్ కలుగజేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన ఈ వైసీపీ ఎమ్మెల్యే ధర్నా గురించి అసలు విషయానికి వద్దాం..ప్రకాశం జిల్లా రాళ్లపాడు పాడు ప్రాజెక్టు వద్ద గత ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేయాలంటూ ఆ ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. తమ సాగునీటి సమస్యలు తీరాలంటే తక్షణమే రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామధేను ప్రాజెక్టుకు నీటి తరలింపును ఆపివేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. అయితే రైతుల ధర్నా విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లి..వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతుల డిమాండ్ న్యాయబద్ధమే అని భావించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి రైతులతో కలిసి ధర్నాకు దిగారు. తక్షణమే రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామధేను ప్రాజెక్టుకు నీటిని తరలిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యే కూడా తమతో పాటు ధర్నాకు దిగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

 ఇక రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ధర్నా చేస్తున్నారంటూ వార్తలు రావడంతో వైసీపీ సీనియర్ నేత వైపీ సుబ్బారెడ్డి అసలు విషయం ఏంటీ అని ఆరా తీవారు. ఎమ్మెల్యే రైతుల డిమాండ్ చెప్పడంతో పాటు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేసే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి వెంటనే రాళ్లపాటు ప్రాజెక్టు సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. రైతులతో పాటు స్వయంగా మన పార్టీ ఎమ్మెల్యేనే ధర్నా చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి చెప్పడంతో వెంటనే రియాక్ట్ అయిన సీఎం జగన్ రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామధేను ప్రాజెక్టు నీటి తరలింపుపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తామని, రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి సాగునీటి ఆ ప్రాంతం రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి  ధర్నా విరమించారు.  అయితే అధికార పార్టీ అయినా రైతుల తరపున ధర్నా చేసిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని సీఎం జగన్ అభినందించారు. మనది రైతు ప్రభుత్వమని, రైతుల సమస్యలపై ఇలాగే పోరాడాలని జగన్ ఎమ్మెల్యేకు చెప్పినట్లు సమాచారం. ఇక తమ ధర్నాకు మద్దతు పలికి, సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిపై రాళ్లపాడు ప్రాజెక్టు రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ ధర్నా వ్యవహారం అటు ప్రభుత్వంలో. ఇటు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: