మంత్రి వర్గం లో స్థానం దక్కకపోవడం అలకపాన్పు ఎక్కిన నగరి ఎమ్మెల్యే రోజాను బుజ్జగించే పనిలో పార్టీ నాయకత్వం నిమగ్నమైంది. బుజ్జగింపు పర్వం లో  భాగంగానే ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలవాలంటూ  రోజా కు ఎంపీ విజయసాయి రెడ్డి వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. రోజా కూడా జగన్మోహన్ రెడ్డి ని కలిసేందుకు పయనమయినట్లు సమాచారం.


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫైర్ బ్రాండ్ రోజాకు మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించారు. రోజా కూడా తనకు జగన్ కేబినెట్ లో చోటు దక్కడం ఖాయమని భావించారు. తనకు హోమ్ మంత్రి పదవి అంటే అత్యంత ఇష్టమని, పరోక్షంగా తనకు హోమ్ మంత్రిత్వ శాఖకేటాయించాలని జగన్ కు చెప్పకనే చెప్పారు. హోమ్ మంత్రిత్వ శాఖ ను మరొక మహిళ ఎమ్మెల్యేకు కేటాయించిన జగన్, రోజాకు మాత్రం మంత్రివర్గం లో చోటు కల్పించలేదు. దీనితో తీవ్ర అసంతృప్తి గురైన రోజా గత నాలుగైదు రోజుల నుంచి పార్టీ నేతలకు అందుబాటు లో లేకుండా అజ్ఞాతం లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 


మంత్రి పదవి దక్కకపోవడం తో రోజా అసంతృప్తి తో ఉన్నారని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి, తనని వచ్చి కలవాల్సిందిగా విజయసాయి రెడ్డి ద్వారా ఆమెకు వర్తమానం పంపారు. అధినేత ఆదేశాలతో ఆయన్ని కలవడానికి బయల్దేరిన రోజా కు జగన్ ఏ పదవి కట్టబెడుతారన్నది ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే మంత్రి వర్గం ఏర్పాటు చేసిన జగన్, కీలక పదవులను కూడా ఇతర నేతలకు అప్పగించారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల పంపకం మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యం లో రోజా నామినేటెడ్ పదవి తో సరిపెట్టుకుంటుందా ?, లేకపోతే రెండున్నర ఏళ్ల తరువాత మంత్రివర్గం లో చేరేందుకు ఇష్టపడుతుందా?? అన్నది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: