వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ నేత ఆర్కే రోజా  ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. కేబినెట్ లో మంత్రి పదవి దక్కలేదని మనస్తాపంతో ఉన్నారన్న వార్తల మధ్య ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో స‌మావేశం అయిన రోజా...దాదాపు పది నిమిషాలపాటు సీఎంతో మాట్లాడారు. ఈ సమావేశం అనంత‌రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి పదవి దక్కనందుకు తనకు ఎటువంటి అసంతృప్తీ లేదని రోజా స్పష్టం చేశారు. అయితే, జ‌గ‌న్‌తో భేటీలో త‌న‌కు నామినేటెడ్ ప‌ద‌వి వ‌ద్ద‌ని ఆమె వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది.


జ‌గ‌న్‌తో భేటీ అనంత‌రం రోజా మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారు. అలగడాలు.. బుజ్జగించడాలు వంటివి లేనేలేవని.. అటువంటి తప్పుడు కథనాలతో తమ మధ్య దూరం పెంచవద్దని రోజా కోరారు. మంత్రి పదవి రానందుకు తాను అసంతృప్తికి లోనయ్యానంటూ వచ్చిన కథనాలను చూసి తానూ బాధపడ్డానని చెప్పారు.  జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా పదేళ్లు కష్టపడ్డామని.. తమకు పదవుల కోసం కాదని అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే...తామంతా ముఖ్యమంత్రి అయినట్టేనని చెప్పిన రోజా.. తమ నియోజకవర్గ ప్రజలకు 'నవరత్నాలు' అందేలా చూస్తానన్నారు.


కాగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసే ముందు పార్టీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డితో రోజా సమావేశమయ్యారు. దాదాపు అరగంటపాటు ఆయనతో మాట్లాడిన రోజా.. తనకు జరిగిన అన్యాయంపై వివరించినట్టు తెలిసింది. అనంత‌రం సీఎం జ‌గ‌న్‌ను రోజా ఇవాళ కలిశారు. తనకు ఎలాంటి పదవులూ వద్దని జగన్‌తో రోజా చెప్పినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: