ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కూర్పు పూర్తయింది. అందరి అంచనాలకు భిన్నంగా తొలి విడతలోనే 25 మందితో జగన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో చాలామంది కేబినెట్ కోసం ఆశించిన కొందరికి నిరాశ తప్పలేదు. జగన్ కేబినెట్‌ను ప్రకటించినప్పుడే రెండున్నర ఏళ్ల తర్వాత 20 మంది మంత్రులను తప్పిస్తానని... వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. దీంతో ఇప్పుడు మంత్రి పదవి రాలేదని నిరాశ చెందిన వారిలో కొంత ఆశలు ఏర్పడ్డాయి. కేబినెట్ బెర్త్‌ ఆశించిన వారిలో దాదాపు 20 మందికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. 


చివరకు జగన్ మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తో పాటు... చిలకలూరిపేటకి చెందిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌కు కూడా మంత్రి పదవి రాలేదు. వీరిద్దరికీ రెండున్నర ఏళ్ల తర్వాత జరిగే ప్రక్షాళనలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఆయన సాధించిన విజయాలలో వైసీపీ నుంచి మూడుసార్లు గెలవడం విశేషం. జగన్ కోసం తన ఎమ్మెల్యే పదవి వదులుకున్న రామకృష్ణారెడ్డి 2012 ఉప ఎన్నికలతో పాటు 2014, 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ నుంచి ఏకంగా హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి సీనియర్ నేతకు కూడా మంత్రి పదవి రాలేదు. రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి ప్రధాన కారణం క్యాస్ట్ ఈక్వేషన్లే అని చెప్పాలి.


జిల్లాలో పార్టీ పరంగా తనకంటే జూనియర్లకు కూడా పదవులు ఇచ్చిన జగన్... రామకృష్ణారెడ్డికి కేవలం క్యాస్ట్ ఈక్వేషన్ కారణంగానే మంత్రి పదవి ఇవ్వలేదన్న విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నడిచిన రామకృష్ణారెడ్డికి రెండున్నర ఏళ్ల తర్వాత జరిగే మార్పులు చేర్పుల్లో ఖ‌చ్చితంగా మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రామకృష్ణారెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారు. రెండున్నర ఏళ్ల తర్వాత జరిగే ప్రక్షాళన లో గుంటూరు జిల్లాకే జగన్ మూడు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే తాను హామీ ఇచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితో పాటు  మర్రి రాజశేఖర్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా పదవులు ఇవ్వాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: