ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ నేత‌గా ముద్ర ప‌డిన  నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అల‌క‌ ఎపిసోడ్‌కు దాదాపుగా శుభం కార్డు ప‌డింది. రోజాకు మంత్రి పదవి దక్కలేదని.. ఆమె అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు రావడంతో… జగన్- రోజా భేటీ ఆసక్తి రేపింది. విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవ్వాల‌ని ఉదయం విజయసాయిరెడ్డి ఫోన్ చేయడంతో.. ఆమె హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి జగన్‌ను కలుసుకున్నారు. అనంత‌రం తాను మంత్రిన‌వుతానంటూ ప్ర‌క‌టించారు.


వైఎస్ జగన్‌తో భేటీ తర్వాత ఉత్సాహంగా కనిపించిన‌ రోజా మీడియాతోనూ అదే జోష్ లో మాట్లాడుతూ...సీఎంగా జగన్ ప్రమాణం చేశాక ఇవాళే కలిశానననీ.. రేపటినుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి.. ఏం చేయాలనేదానిపై చర్చించానని చెప్పారు. జగన్ ను సీఎం చేయాలని తాము అందరం కోరుకున్నామని.. అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. 9ఏళ్ల కల పూర్తయిందని అన్నారు. పదవులు ఆశించి వైసీపీలో పనిచేయలేదన్నారు రోజా. జగన్ సీఎం అయితే తాము అందరం సీఎం అయినట్టే అన్నారు. తనకు, జగన్ కు మధ్య దూరం పెంచేలా మీడియాలో వచ్చిన వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారని.. అలాంటిదేం లేదన్నారు. అంతా బాగుంటే.. అందరూ కోరుకున్నట్టయితే.. భవిష్యత్తులో మంత్రినవుతా అంటూ వ్యాఖ్యానించారు. 


మంత్రి పదవి రానందుకు తాను అసంతృప్తికి లోనయ్యానంటూ వచ్చిన కథనాలను చూసి తానూ బాధపడ్డానని రోజా చెప్పారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా పదేళ్లు కష్టపడ్డామని.. తమకు పదవుల కోసం కాదని అన్నారు. అలగడాలు.. బుజ్జగించడాలు వంటివి లేనేలేవని.. అటువంటి తప్పుడు కథనాలతో తమ మధ్య దూరం పెంచవద్దని కోరారు.  జగన్‌ ముఖ్యమంత్రైతే తామంతా ముఖ్యమంత్రి అయినట్టేనని చెప్పిన రోజా.. తమ నియోజకవర్గ ప్రజలకు 'నవరత్నాలు' అందేలా చూస్తానన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: