నిన్నటి వరకు ఇంట్లో హాయిగా..చల్లగా ఆటపాటలతో సేద తీరిన పిల్లలు ఇప్పుడు బడి బాట పట్టనున్నారు.  దాదాపు 45 రోజుల వేసవి సెలవుల తర్వాత నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత కొన్ని సంవత్సరాలుగా జూన్ 1నే పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ ఈ యేడాది ఎండ తీవ్రత ఎక్కువ గా ఉండటంతో జూన్ 12 నుంచి పునఃప్రారంభించాలని నిర్ణయించారు. 

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో కలిపి మొత్తం 62,063 పాఠశాలలు ఉండగా 70,41,694 లక్షల మంది విద్యార్థులు కొత్త తరగతులలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.  భవిష్యత్తులోనూ ఉష్ణోగ్రతలు ఇలానే ఉండే అవకాశం ఉందని భావించిన విద్యాశాఖ మళ్లీ పాత విధానానికే జై కొట్టింది. మునుపటి పద్ధతిలోనే యథావిధిగా జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయించింది.  కాగా,  ఎండల తీవ్రత కారణంగా వాతావరణశాఖ చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుని నాలుగు రోజులపాటు ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 8 నుంచి 12:30 గంటల వరకే పాఠశాలలు ఉంటాయి. ఇక కొత్త విద్యా క్యాలండర్‌లో పాఠశాలల వేళల్లో మార్పులు చేయలేదు. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనివేళలు.. ఉదయం 9.30 నుంచి సాయం త్రం 4.45 గంటల వరకు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడవనున్నాయి.  ప్రాథమిక పాఠశాలలు మాత్రం 4 గంటల వరకే నడవనున్నాయి.  ప్రతి స్కూల్లో రోజూ 90% విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.

క్యుమిలేటివ్ రికార్డులను కూడా సరిగా నిర్వహించాలని, ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాఠశాల నిర్వహణ కమిటీలో ప్రధానోపాధ్యాయులు భాగస్వాములు కావాలి. తరుచుగా స్కూల్‌కు రాని విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులను సంప్రదించి, ఆ విద్యార్థి రోజూ స్కూల్‌కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: