ఏపీలో అగ్రిగోల్డ్ బాధితుల గురించి తెలుసు..పాపం దాదాపు 32 లక్షల మంది అగ్రిగోల్డ్ యాజమాన్యం చేతిలో మోసపోయారు. దీంతో ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్ముకుందామనే ప్రయత్నం చేశాయి కాని...అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. తాజాగా ఏపీ సీఎం జగన్ రూ.1100 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు కేటాయించి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్రిగోల్డ్ బాధితులను మించి ఇప్పుడు ఏపీలో కోడెల ఫ్యామిలీ  " కే" ట్యాక్స్‌కు  బలైపోయిన బాధితుల వివరాలు బయటకు వస్తున్నాయి. 


పూర్తి వివరాల్లోకి వెళితే  గత ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కే ట్యాక్స్‌ పేరుతో కోడెల కుటుంబం విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దందాలు, అక్రమ వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో కే ట్యాక్స్ బాధితులు బయటకు వస్తున్నారు.  పోలీసులు కూడా కే ట్యాక్స్ బాధితులు పూర్తి వివరాలతో తమ ముందుకు వస్తే విచారణ చేపట్టి న్యాయం చేస్తామని ప్రకటించారు. 


జగన్ సర్కార్ ఇచ్చిన భరోసాతో గత వారం రోజులుగా కే ట్యాక్స్‌ బాధితులు  నరసరావుపేట, సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌లకు బారులు తీరుతున్నారు. కోడెల కుటుంబంపై ఫిర్యాదుల పరంపర మంగళవారం కూడా కొనసాగింది.   అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోడెల కొడుకు శివరాం,  సామాన్య ప్రజలపై పెత్తనం చెలాయించారు. విలువైన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి రూ.కోట్లు దండుకున్నారు. ల్యాండ్‌ కన్వర్షన్, అపార్ట్‌మెంట్‌ల అనుమతుల వ్యవహారంలో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. కే ట్యాక్స్‌ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. 


సత్తెనపల్లి, నరసరావుపేటలలో ఎవరైనా ప్లాట్లు కొన్నా, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొన్నా కే ట్యాక్స్ కట్టాల్సిందే. ఒక వేళ కే ట్యాక్స్ కట్టకుంటే..వారిని వేధింపులకు గురిచేయడం కోడెల ఫ్యామిలీకి పరిపాటి. ప్రాణాల మీద ఆశతో విధిలేని పరిస్థితులలో కే ట్యాక్స్ కట్టి దేవుడా..బతికిపోయాం అంటూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి. కే ట్యాక్స్ ఎంత దారుణంగా సాగిందంటే..కోడెల ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా, స్వీట్ షాపులు, మటన్‌, చికెన్ షాపులు, రెస్టారెంట్లు ఆ రోజు కోడెల ఫ్యామిలీ ఫంక్షన్‌‌కు విధిగా స్వీట్లు, మటన్, చికెన్, బిర్యానీలు వారి ఇంటికి పంపించాల్సిందే. లేకుంటే షాపుకు ఇన్ని వేలు అంటూ కే ట్యాక్స్ కట్టాల్సిందే. టీడీపీ మీటింగ్‌లకు కూడా సత్తెనపల్లిలో షాపుల వాళ్లు, ఇండస్ట్రీల వాళ్లు మామూళ్లు చెల్లించుకోవాల్సిందే. 


ఇక సత్తెనపల్లి, నరసరావుపేటలలో బిల్డర్ల పరిస్థితి మరీ దారుణం..అపార్లమెంట్లు కడితే అందులో ఒక ఫ్లాట్ కచ్చితంగా కోడెల ఫ్యామిలీకి ఇవ్వాల్సిందే. లేకుంటే కోడెల అనుచరుల చేతిలో బలైపోవాల్సిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా వదల్లేదు కోడెల ఫ్యామిలీ...ఎవరైనా వెంచర్లు వేస్తే వెంటనే కోడెల అనుచరులు అక్కడ జెండా పాతి, ఈ స్థలం కబ్జాకు గురికాకుండా ఉంటే కోడెల కూతురు విజయలక్ష్మీతో మాట్లాడుకుని కే ట్యాక్స్ చెల్లించాలని హెచ్చరించేవారు. ఇంతలా కోడెల ఫ్యామిలీ అరాచకం సాగింది. 


గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, చంద్రబాబు ఉన్నాడులే అన్న ధైర్యంతో సత్తెనపల్లి, నరసరావుపేటలలో కోడెల ఫ్యామిలీ యధేచ్ఛగా సాగించిన దోపిడీకి బలైపోయిన బాధితులు వేలాదిగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే కోడెల కొడుకు శివరాం, కూతురు విజయలక్ష్మీలపై కేసులు నమోదు అయ్యాయి. ఇన్నాళ్లు చంద్రబాబు ప్రభుత్వంలో కోడెల ఫ్యామిలీ అరాచకాలకు భయపడి బిక్కుబిక్కుమంటూ బతికిన బాధితులు ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావడంతో మెల్లమెల్లగా పోలీస్ స్టేషన్లకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.  గుంటూరుతో మొదలుపెట్టి నంద్యాల వరకు కే ట్యాక్స్ బాధితులు వేలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది.  మొత్తంగా అగ్రిగోల్డ్ బాధితులతో కోడెల బాధితులు పోటీపడుతున్నారంటూ సత్తెనపల్లి, నరసరావుపేటలలో చర్చ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: