పాపం కోడెల కుటుంబంపై అన్యాయంగా కేసులు పెడుతున్నారట.  ఇప్పటికే తన కుటుంబంపై 8 కేసులు పెట్టారని కోడెల వాపోతున్నారు. తన కుటుంబ సభ్యులను బెదిరించి మరీ కేసులు పెట్టటం ఏమన్నా భావ్యమా ? అంటూ బీదమాటలు మాట్లాడుతున్నారు ఇపుడు.

 

నిజంగా కొత్తవారెవరైనా కోడెల మాటలు వింటే అయ్యో పాపం అనే అంటారు. అదే గడచిన ఐదేళ్ళల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్పీకర్ వ్యవస్ధ మర్యాదను కూడా  నేలబారుకు దింపేసిన కోడెల చరిత్ర తెలిసిన వారు మాత్రం ఇపుడు పెడుతున్న కేసులు చాలా తక్కువే అంటారు.

 

కోడెల అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు కోడెల శివరామ కృష్ణ, కూతురు విజయలక్ష్మి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలను ఇద్దరూ పంచుకుని మరీ దోచేసుకున్నారు.  రైతుల భూములు కబ్జా చేశారు. ఇంటి స్ధలాలను ఆక్రమించుకున్నారు. వ్యాపారస్తులను, వర్తకులను బెదిరించి మరీ కోట్లలో డబ్బులు వసూళ్ళు చేశారు. అదేమని ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై కేసులు పెట్టించి చిత్రహింసలకు గురిచేయించారు.

 

పిల్లలు అలా నియోజకవర్గాల్లో దోచేసుకుంటే ఇక కోడెల వైసిపి సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసెంబ్లీలో  సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు. ఫిరాయింపులను ప్రోత్సహించారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు.  తన ఆహ్వానం మీద మహిళా సాధికారిక సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రోజాను పోలీసులకు ఆదేశాలిచ్చి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బలవంతంగా గన్నవరం విమానాశ్రయం నుండి హైదరాబాద్ కు తరలించారు.

 

చెప్పుకుంటూ పోతే అరాచకాలకు అంతే లేదు. సీన్ కట్ చేస్తే టిడిపి ఘోరపరాజయంతో పాటు కోడెల కూడా ఓడిపోయారు. దాంతో అప్పటి కోడెల బాధితులకు ఇపుడు ధైర్యం వచ్చింది. అందుకనే వరుసగా బాధితులంతా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. రేపో మాపో అరెస్టులు కూడా తప్పవంటున్నారు. ఈ నేపధ్యంలోనే కోడెల మాట్లాడుతూ తన కుటుంబంపై అక్రమ కేసులు పెడుతున్నట్లు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: