ఏపీలో కొత్త అసెంబ్లీ కొలువు దీరింది. ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీని కైవసం చేసుకుని ప్ర‌భు త్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్.. బుధ‌వారం నుంచి ఐదు రోజుల పాటు తొలి అసెంబ్లీని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం ఉద‌యం ఖ‌చ్చితం 11.5 గంట‌ల‌కు అసెంబ్లీ స‌మావేశాలు జ‌న‌గ‌ణ‌మ‌న జాతీయ గీతంతో ప్రారంభ‌మ‌య్యాయి. ప్రొటెం స్పీక‌ర్‌గా బొబ్బిలి నుంచి విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కుడు శంబంగి అప్ప‌ల‌నాయుడు స‌భ్యుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. 


అయితే, ఈ కొత్త‌స‌భ‌లో స‌రికొత్త‌గా క‌నిపించేందుకు వైసీపీ, టీడీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నించారు. మ‌రో విశేషం ఏంటంటే.. ఈ స‌భ‌లో కేవ‌లం వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు మాత్ర‌మే క‌నిపించ‌నున్నారు. అతి పెద్ద జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడాల‌భించ‌లేదు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ నాలుగు స్థానాలు ద‌క్కించుకుని అసెంబ్లీలో అడుగు పెట్టినా..ఈ ద‌ఫా పూర్తిగా ఓట‌మి పాలైంది. ఇక‌, తాజా అసెంబ్లీ విష‌యానికి వ‌స్తే.. టీడీపీ అభ్య‌ర్థుల్లో అధినేత చంద్ర‌బాబు స‌హా అంద‌రూ పార్టీ క‌ల‌ర్ దుస్తులు వేసుకుని స‌భ‌కు హాజ‌రు కావాల‌ని తీర్మానించారు. అయితే, ఉర‌వ‌కొండ నుంచి విజ‌యం సాధించిన ప‌య్యావుల కేశ‌వ్ మాత్రం సాధార‌ణం వైట్ దుస్తుల్లో రాగా.. పార్టీ కండువా మాత్రం మెడ‌లో ధ‌రించారు. 


ఇక‌, వైసీపీ నాయ‌కులు సాధార‌ణ దుస్తుల్లోనే వ‌చ్చినా రోజా స‌హా ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రూ పార్టీ కండువాల‌తోనే స‌భా ప్ర‌వేశం చేశారు. పార్టీల బ‌లాబ‌లాల‌కు సంబంధించి కేటాయించిన సీట్ల‌లోనే అంద‌రూ ఆశీనుల‌య్యారు. ఇక‌, సీఎం జ‌గ‌న్ ఖ‌చ్చితంగా స‌మ‌యానికి రాగా, ఆయ‌న‌క‌న్నా రెండు నిముషాల ముందుగానే టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌భ‌లోకి అడుగు పెట్ట‌డం విశేషం. ఇక‌, హిందూపురం ఎమ్మెల్యే బాల‌య్య టీడీపీలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఆయ‌న ఆహార్యం అంతా కూడా ప‌సుపుమ‌యం కావ‌డం విశేషం. స‌భ్యులు ఒక్కొక్క‌రితోనూ ప్రొటెం స్పీక‌ర్ శంబంగి నారాయ‌ణ ఆర్టిక‌ల్ 188 ప్ర‌కారం ప్ర‌మాణ స్వీకారం చేయించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: