ఏపీ అసెంబ్లీలో ఇవాళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా అధికార పార్టీ ఎమ్మెల్యేగా దర్జాగా అడుగుపెడుతున్నారు. మరోవైపు తాము అధికారంలోకి ఉండగా తమను అసెంబ్లీలో చెడుగుడు ఆడే నాటి ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాపై తన ఎమ్మెల్యేలను ఉసిగొల్పి, బూతులు తిట్టించి, ఆఖరికి అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయించిన నాటి సీఎం చంద్రబాబు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో కూర్చున్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా రోజాను చూసి అన్ని రోజులు ఒకలా ఉండవు చంద్రబాబు అంటూ తెలుగు తమ్ముళ్లు తమలో తాము అనుకుంటున్నారు. నిప్పులాంటి తనను తుప్పు, తన కొడుకు లోకేష్‌ను పప్పు అంటూ ప్రతి రోజు ఏడిపించే  రోజా అంటేనే చంద్రబాబుకు అస్సలు పడదు. అందుకే అసెంబ్లీలో అడ్డగోలుగా నోరుపారేసుకునే అచ్చెం నాయుడు, బోండా ఉమ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వంగలపూడి అనిత లను రోజాపై  ఎటాక్ చేయించేవాడు చంద్రబాబు. 


అసెంబ్లీలో రోజా ఉంటే తమ బండారాలన్నీ బయటపడతాయని, ఆమె వ్యాఖ్యలతో ప్రజల్లో తమ పరువు పోతుందని భావించిన చంద్రబాబు సమయం చూసి రోజాను ఏడాదినర్నలోనే అసెంబ్లీ నుంచి బహిష్కరింపజేశాడు.  2015, డిసెంబ‌ర్ 18న  ఏపీ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు జ‌ర‌ుగుతున్న సందర్భంగా బెజవాడలో కలకలం రేపిన బెజవాడ కాల్ మ‌నీ వ్య‌వ‌హ‌రం పైన నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ స‌భ‌లో ప్ర‌భుత్వాన్ని నిలదీస్తుంది.  ఈ సందర్భంగా వైసీపీ నుండి మ‌హిళా ఎమ్మెల్యే  రోజా కాల్‌మనీ సెక్స్ రాకెట్‌‌లో టీడీపీ నేతలు మహిళల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విరుచుకుపడుతుంది..అదే ఊపులో కాల్‌మనీ బాబు అంటూ చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. . దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రోజాపై అసభ్య పదజాలంతో తిట్టడం మొదలుపెట్టారు. అయితే రోజాను అసెంబ్లీలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఆదేశాల మేరకు నాటి  స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్  రోజాను ఏడాది పాటు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 


రోజా సస్పెన్షన్‌పై  విప‌క్ష నేత జ‌గ‌న్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. క‌నీసం రోజా వివ‌ర‌ణ వినాల‌ని స్పీకర్‌ను పలుమార్లు అభ్యర్థించారు. కానీ రోజాను అసెంబ్లీలో లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్న.. స్పీక‌ర్ కోడెల రోజా సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోలేదు.  ఆ తర్వాత తనను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని రోజాకు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా సభలోకి రోజాను అనుమతించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినా స్పీకర్ కోడెల లెక్క చేయలేదు..శాసనసభలో స్పీకర్‌దే అంతిమ నిర్ణయం అంటూ కోర్టు ఆదేశాలను కోడెల తిరస్కరించారు.  అయితే ఏడాది తర్వాత బహిష్కరణ ముగిసినా చంద్రబాబు ఆదేశాల మేరకు స్పీకర్ కోడెల రోజాను అసెంబ్లీలోకి అనుమతించలేదు. రోజా బహిష్కరణతో పాటు తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా జగన్ కోరినా స్పీకర్ పట్టించుకోకపోవడంతో ఏకంగా వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. మొత్తం మూడున్నరేళ్లుగా రోజా అసెంబ్లీకి దూరమయ్యారు.


వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి బహిష్కరించినా చంద్రబాబు ఊరుకోలేదు. ఆమెను అమరావతిలో నిర్వహించిన మహిళా సదస్సుకు రానివ్వకుండా పోలీసు వ్యానులో రోజంతా తిప్పి వేధింపులకు గురి చేసి హైదరాబాద్‌కు తిప్పి పంపించారు.  బోండా, దేవినేని ఉమ, గోరంట్ల వంటి నేతలు పలు మార్లు రోజాపై అనుచిత వ్యాఖ్యలతో అవమానించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు రోజా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సగర్వంగా అడుగుపెడుతుంటే..నాటి అధికారం అడ్డంపెట్టుకుని రోజాను సస్పెండ్ చేయించిన చంద్రబాబు ప్రతిపక్షనాయకుడిగా కూర్చున్నారు. మరోవైపు రోజాను సస్పెండ్ చేసిన స్పీకర్ కోడెల ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. రోజాపై అడ్డగోలుగా నోరు పారేసుకున్న బోండా ఉమ, దేవినేని ఉమ, వంగలపూడి అనిత లాంటి వాళ్లు  ఈ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారు. మొత్తంగా రోజా అధికార పార్టీ ఎమ్మెల్యేగా  అడుగుపెడుతుంటే..హలో చంద్రబాబు గారు..కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి..ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే రోజా వస్తుంది అంటూ వైసీపీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: