ఏపీలో కొత్త‌గా ఏర్పాటైన వైసీపీ ప్ర‌భుత్వం ఆధ్వర్యంలో కొత్తఅసెంబ్లీ కొలువు దీరింది. వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌ల నుంచి గెలిచిన అభ్య‌ర్థుల ప్ర‌మాణ స్వీకారంతో ప్రారంభ‌మైన కొత్త అసెంబ్లీ తొలిరోజు స‌భ్యుల ఆనందానికిఅవ‌ధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా వైసీపీ నాయ‌కుల‌ను టీడీపీ నాయ‌కులు వెతుక్కుంటూ వ‌చ్చి అభినందించ‌డం విశేషంగా చెప్పుకొంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన టీడీపీ నాయ‌కులు నేరుగా వైసీపీ నేత‌ల వ‌ద్దకు వెళ్లి మ‌రీ అభినంద‌న‌లు చెప్ప‌డం కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీసింది. 


డిప్యూటీ సీఎంగా ఎంపికైన క‌డప ఎమ్మెల్యే అంజద్ బాషా, ఎమ్మెల్యే జోగి రమేష్‌ల‌ను హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ప‌ల‌క‌రించారు. అది కూడా అసెంబ్లీ లాబీల్లో వారు ఎదురు ప‌డ‌గానే తొలుత బాల‌య్యే వారిని ప‌ల‌క‌రించి కరచాలనం చేశారు. కేవ‌లం ఒక నిముషం మాత్ర‌మే వీరితో ఆయ‌న గ‌డిపిన‌ప్ప‌టికీ.. వారి యోగ‌క్షేమాలు తెలుసుకోవ‌డంతోపాటు కొత్త బాధ్య‌త‌ల‌ను ప‌రిపూర్ణంగా నిర్వ‌హించాల‌ని ఆకాంక్షించారు. దీంతో అక్క‌డే ఉన్న మిగిలిన టీడీపీ నాయ‌కులు ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. 


అదే విధంగా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురైన సంద‌ర్భాల్లో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక‌, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మంత్రి  కొడాలి నానికి  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విషెస్ చెప్పారు. నిజానికి నాని ఎదురుప‌డిన‌ప్పుడు కూడా గ‌తంలో టీడీపీ నాయ‌కులు ఎవ‌రూ విష్ చేసేవారు కారు. అలాంటిది ఇప్పుడు ఆయ‌న మంత్రి ప‌దవిని చేప‌ట్ట‌డంతో ఆయ‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. అలాగే, ఎమ్మెల్యే కాన‌ప్ప‌టికీ..  ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లును కూడా టీడీపీ నాయ‌కులు విష్ చేశారు. కాగా, ఒక‌రిద్ద‌రు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు స‌భ‌లో ప‌క్క‌ప‌క్క‌నే ఒకే సీట్లో కూర్చోవ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ, టీడీపీ స‌భ్యుల‌కు ఇంకా సీట్లు కేటాయించ‌క‌పోవ‌డంతో ఈ ప‌రిణామం చోటు చేసుకుంద‌నిఅసెంబ్లీ వ‌ర్గాలు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: