జగన్ ప్రమాణ స్వీకారం రోజునే చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటికి తీసి ప్రజల ముందు ఉంచుతానని అన్నట్టే పని షురూ అయ్యింది. నారాయణ మంత్రిగా ఉన్న టైమ్ లో ఆయన ఆడింది ఆట, పాడింది పాట. ఒకే అడ్రస్ తో అనుమతి తీసుకుని.. అదే నగరంలో నాలుగుచోట్ల స్కూల్స్, కాలేజీలు నడిపేవారు ఈ మాజీమంత్రి. గతంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితంలేదు.


నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై అప్పట్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఏకంగా ఓ ఉద్యమం కూడా చేశారు. కానీ పట్టించుకున్న నాథుడేలేరు, ఫిర్యాదుల్ని లెక్కలోకి తీసుకున్న అధికార్లూ లేరు. రోజులు మారాయి. బండ్లు ఓడలయ్యాయి, ఓడలు బండ్లు అయ్యాయి. నారాయణ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. పార్టీ కూడా అధికారం కోల్పోయింది.


విద్యావ్యవస్థలో ఉన్న లొసుగుల ఆధారంగా, అటు ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం చేకూరుస్తూ.. ఇటు వందల కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన నారాయణ విద్యాసంస్థలకు మూడింది. అక్రమాల చిట్టా బైటపడుతోంది. దీనికి తొలి అడుగు విజయవాడలో పడింది. విజయవాడ సత్యనారాయణపురంలో ఇలా గుర్తుంపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ ని జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే మూడుసార్లు యాజమాన్యానికి నోటీసులిచ్చినా పట్టించుకోలేదని, అందుకే సీజ్ చేసి లక్ష రూపాయలు జరిమానా విధించామని అధికారులంటున్నారు. నారాయణ విద్యాసంస్థలపై అధికారులు తీసుకున్న తొలిచర్య ఇది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: