అవినీతి రహితంగా రాష్ట్రాన్ని పాలిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌కు ఆదిలోనే పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. అన్ని విష‌యాల్లోనూ పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌నే ఎదుర్కొనేందుకు సిద్ధ‌ప‌డాల్సి వ‌చ్చింది. అది ఏకంగా వంద‌ల‌ కోట్ల రూపాయ‌ల‌కు సంబంధించిన విష‌యం కావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం చుట్టూతానే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో ఆయా స‌మావేశాలను ప్ర‌త్య‌క్షంగా ప్ర‌సారం చేయ‌డం అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. నేరుగా ప్ర‌తి ఒక్క‌రూ స‌భ‌లో ఏం జ‌రుగుతోందో చూసేందుకు గాను, తొలిసారిగా 1995లోనే ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌ను ప్రారంభించారు. 


పార్ల‌మెంటు స‌మావేశాల‌ను అయితే దూర‌ద‌ర్శ‌న్ నేతృత్వంలో ప్ర‌త్యేకంగా పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఛానెళ్ల‌ను ఏర్పాటు చేసుకున్నాయి. స‌మావేశాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నాయి. అయితే, అసెంబ్లీల విష‌యానికి వ‌చ్చే స‌రికి ఎవ‌రు అధికారంలో ఉంటే.. వారు... ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానెళ్ల‌కు ఈ ప్ర‌సారాల రైట్స్‌ను ధారాద‌త్తం చేస్తున్నారు. త‌ద్వారా ఆయా ఛానెళ్లు ఈ ప్ర‌సారాల‌ను మిగిలిన ఛానెళ్ల‌కు అందిస్తున్నాయి. దీనికి సంబంధించి వంద‌ల కోట్ల‌లో ఆయా ఛానెళ్లు ల‌బ్ది పొందుతున్నాయి. తెలంగాణ‌లో అయితే, న‌మ‌స్తే తెలంగాణ మీడియా ఛానెల్ ఈ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. 


ఇక‌, గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ పాల‌న‌లో సంవ‌త్స‌రానికి ఒక‌సారి చొప్పున రెన్యువ‌ల్ చేసుకుంటూ.. మొత్తం అసెంబ్లీ ప్ర‌సారాల హ‌క్కుల‌ను త‌మ అనుకూల మీడియా అయిన ఆంధ్ర‌జ్యోతికి అప్ప‌గించారు. ఏడాదికి 100 కోట్ల చొప్పున ఈ ఒప్పందం జ‌రిగింద‌ని స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా అసెంబ్లీ కార్య‌ద‌ర్శి విష‌యాన్ని గ‌తంలో వెల్ల‌డించారు. అంతేకాదు, ఈ నిర్ణ‌యం ఏక‌ప‌క్షంగానే జ‌రిగిపోయింది. ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటైంది. వైసీపీకి అనుకూలంగా ఉన్న సొంత మీడియా సాక్షి. ఈ మీడియా సంస్థ ప్ర‌స్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో అసెంబ్లీ ప్ర‌సారాల వంటి కీల‌క బాధ్య‌త‌ను ఈ మీడియాకు అప్ప‌గిస్తే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి సంస్థ గ‌ట్టెక్కుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 


ఇప్ప‌టికే సాక్షి మీడియా త‌ర‌ఫున ప్ర‌తిపాద‌న‌లు కూడా సీఎం టేబుల్ మీదికి వ‌చ్చాయి. అయితే, అవినీతి ర‌హితంగా త‌న పాల‌న ఉంటుంద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే ప్ర‌భుత్వానికి సేవ చేసేవారికి అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని(టెండ‌ర్ల విష‌యం) సీఎంగా ప్ర‌మాణం చేసిన రోజునే ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ఏక‌ప‌క్షంగా అసెంబ్లీ ప్ర‌సారాల హ‌క్కుల‌ను సాక్షికి అప్ప‌గిస్తారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అప్ప‌గిస్తే.. త‌న సంస్థ బాగుప‌డుతుంది. ఆర్థికంగా పుంజుకుంటుంది. అయితే, అదేస‌మ‌యంలో విప‌క్షాలు ఇలా ఇవ్వ‌డాన్ని ఎండ‌గ‌డ‌తాయి! మ‌రి ఏం చేయాల‌నే విష‌యంపై జ‌గ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: