ఏపీలో జ‌రిగిన శాస‌న‌స‌భ‌, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తిరుగులేని మెజార్టీ సాధించిన వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌రిపాల‌నాప‌రంగా వేగ‌వంత‌మైన నిర్ణ‌యాల‌తో స‌రికొత్త సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ వచ్చే ఐదు సంవత్సరాల పాటు ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సీపీ జెండాయే ఎగరాలన్న దృఢ సంకల్పంతో ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలకు రెడీ అవుతున్నారు. ఏపీలో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరనుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇక ఇప్పుడు జగన్ ముందున్న పెద్ద పరీక్ష విశాఖ మేయ‌ర్ పీఠాన్ని దక్కించుకోవడం.


రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం... కాస్మోపాలిటన్ సిటీ.... ఏడాదికి రూ. 3500 కోట్ల బడ్జెట్ తో ఉన్న విశాఖ మహానగరాన్ని ఆధిపత్యంలోకి తీసుకోవాలని అప్పుడే జగన్ భారీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. విశాఖ మేయ‌ర్ పీఠాన్ని వైసీపీ ఖాతాలో వేయాలని జగన్ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ఇప్పటికే సూచించినట్టు తెలుస్తోంది. విశాఖ మహానగర పాలక సంస్థ తొమ్మిదేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకుండా ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తుంది. ఈ మహా నగర పాలక సంస్థలో కొన్ని మున్సిపాలిటీలు.. పంచాయతీల విలీనంపై కోర్టులో స్టే ఉండడంతో ఎన్నికలు జరగలేదు. ఇక ఇవన్నీ ఇలా ఉంటే గతంలో వైఎస్ ఉండగా 2007లో జరిగిన మేయ‌ర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.


తాజా ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి సునామీలా వీస్తే విశాఖ నగరంలో మాత్రం నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. నగరంలో ఉన్న తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వైసీపీకి గాజువాక, భీమిలి ఎమ్మెల్యే సీట్లు మాత్రమే లభించాయి. న‌గ‌రంలో ఫలితాలు ఓ విధంగా జగన్ కు నిరాశ కలిగించాయి. కాస్తో కూస్తో ఊర‌ట ఏంటంటే ఎంపీ సీటును వైసీపీ స్వ‌ల్ప తేడాతో గెలుచుకుంది. 


ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖలో వైసీపీ సత్తా చాటాలని జగన్ క‌సితో ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖ నగరంపై వైసిపికి ప‌ట్టు లేకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు చూడాల్సి వచ్చిందని జగన్ నిర్ణయానికి వచ్చారు. న‌గ‌ర‌ పరిధిలో ఉన్న భీమిలి ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ. సత్యనారాయణకు జగన్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు.. మేయ‌ర్ పీఠం మ‌న‌మే గెలవాలి అని జగన్ ఆదేశించినట్టు వైసిపి నాయకులు చెబుతున్నారు. మ‌రి న‌గ‌ర వైసీపీ శ్రేణులు ఈ సారి అయినా క‌సితో మేయ‌ర్ పీఠంపై త‌మ జెండా ఎగిరేలా చేస్తాయో ?  లేదో ?  చూడాలి. ఆరు నెల‌ల్లోనే విశాఖ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: