ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏమనుకున్నా కేబినెట్ కూర్పులో తాను ఏం చేయాలనుకున్నారో ? అది స్పష్టంగా చేసి చూపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి ప్రతి ఒక్కరు క్యాబినెట్లో ఎనిమిది నుంచి పది మంది వరకు రెడ్డి వర్గం మంత్రులు ఉంటారని అంచనా వేశారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం నలుగురు రెడ్డి నేత‌ల‌కు మాత్రమే మంత్రి పదవులు కేటాయించారు. ఎవరూ ఊహించని విధంగా బీసీలకు 8, కాపులకు 4, ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. ఈ క్రమంలోనే ఖ‌చ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న కొందరు సీనియర్ నేతలకు మొండిచేయి ఎదురైంది. ఇలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక‌రు.


కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడుస్తూ వచ్చారు. జగన్ తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ గా ఎంపికయ్యారు. ఆ తర్వాత వైసిపిలోకి జంప్ చేసి.. ఆ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి 2014 ఎన్నికల్లో స‌ర్వేప‌ల్లి నుంచి తాను విజయం సాధించడంతో పాటు.... జిల్లాలో 7 ఎమ్మెల్యే, నెల్లూరు ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక తాజా ఎన్నికల్లో మరోసారి మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఘన విజయం సాధించారు. జగన్‌తో అనుబంధం ఉండటం... పార్టీ పట్ల తనకున్న విధేయత నేపథ్యంలో ఈసారి ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు.


ఆయన కూడా క్యాబినెట్ లో తనకు కీలకమైన పదవి వస్తుందని... ఎన్నికల ఫలితాలు వచ్చాక తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. అయితే అనూహ్యంగా నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డికి మాత్రమే జ‌గ‌న్‌ తన కేబినెట్లో చోటు కల్పించారు. దీంతో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ సహజంగానే కాకాణికి అసంతృప్తి కలిగింది. కాకాణి అసంతృప్తితో ఉన్నారనే వార్తలు నెల్లూరు జిల్లా వైసీపీ నేతల ద్వారా జగన్ దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఉన్న ఆయనకు వెంటనే సీఎం జగన్ ను కలవాలని ఫోన్ రావడంతో ఆయన హుటాహుటిన బయలుదేరి అమరావతి కి వెళ్లారు. 


సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయిన కాకాణికి సీఎం నుంచి అన్నా నీ భవిష్యత్తు నాది అని స్పష్టమైన హామీ వ‌చ్చినట్టు తెలుస్తోంది. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు... నెల్లూరు లోక్‌స‌భ‌ సీటును కూడా గెలిచిన రావడంపై జగన్ హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. ఇక వచ్చే రెండున్నర సంవత్సరాల తర్వాత జరిగే క్యాబినెట్ మార్పులు... చేర్పుల‌లో మంత్రి పదవి పై జగన్ నుంచి హామీ ఇచ్చినట్టు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది. ఎట్టకేలకు జగన్ బుజ్జ‌గింపులు ఫలించడంతో కాకాణి సైలెంట్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: