జగన్ తాను ఇచ్చిన హామీలను అన్నిటికి టైం లిమిట్ పెట్టుకుంటూ శెరవేగంగా అమలు చేసుకుంటూ పోతున్నారు. దీనితో అసలే వీక్ గా ఉన్న ప్రతిపక్షానికి ఏం చేయాలో అర్ధం కావటం లేదు. ఈ క్రమంలోనే మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. జగన్ తమకు అవకాశం ఇవ్వకుంటే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వంపై బురద జల్లాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారట.


ఇలా చేస్తే అసలుకే ఎసరు వస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని ఎమ్మెల్యేలు - నేతలకు ఆయన దిశానిర్ధేశం చేశారని తెలిసింది. ఇదే అసెంబ్లీలోనూ కొనసాగించాలని అన్నారట చంద్రబాబు. అంతేకాదు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఏదైనా అవకాశం దొరికినప్పుడు మాత్రమే రెచ్చిపోవాలని - లేకుంటే ప్రజా సమస్యలపైనే ఎక్కువగా దృష్టి సారించాలని కూడా ఆయన చెప్పారట. దీనితో పాటు అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం చేయడం.. సభ నుంచి వాకౌట్ అవడం వంటివి అస్సలు చేయకూడదని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.


తెలుగుదేశం పార్టీకి తక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా.. రాష్ట్రంలో బలమైన - బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రజల్లో పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు - ఫలితాల సాధనకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. అనేక ఆశలతో ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు కాబట్టి వాటిని నెరవేర్చడానికి కొత్తగా వచ్చిన వారికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: