పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే  జగన్మోహన్ రెడ్డి మంత్రికి పెద్ద టార్గెట్టే పెట్టారు. తొందరలో జరగనున్న విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలంటూ జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దాంతో టెన్షన్ మొదలైపోయింది మంత్రిలో.

 

మంత్రికి టెన్షన్ ఎందుకంటే మొన్నటి అసెంబ్లీలో రాష్ట్రంలో వైసిపి అఖండ విజయం సాధించినా విశాఖపట్నం జిల్లా ఫలితాలు మాత్రం వైసిపికి ఒకరకంగా చేదునే మిగిల్చింది. ఎలాగంటే విశాఖపట్నం నగరంలోని నాలుగు అసెంబ్లీ స్ధానాలైన విశాఖ తూర్పు, పశ్చిమం, ఉత్తర, ధక్షిణ నియోజకవర్గాల్లో వైసిపి ఓడిపోయింది.

 

విచిత్రమేమిటంటే విశాఖపట్నం ఎంపి సీటు గెలిచినా నగరంలోని నాలుగు సీట్లలో మాత్రం వైసిపి ఓడిపోయింది. అంటే నగరానికి ఆనుకునే ఉన్న భీమిలి, గాజువాకలో గెలవటంతో పాటు పై నాలుగు అసెంబ్లీల్లో కాస్త క్రాస్ ఓటింగ్ జరగటంతో ఎంపి సీటులో వైసిపి గట్టెక్కింది. లేకపోతే వైసిపి ఓడిపోయేదే.

 

మొన్నటి ఫలితాలను బట్టి అర్ధమవుతున్నదేమంటే విశాఖ నగరంపై వైసిపికి ఇంకా పట్టు దొరకలేదని. జిల్లాలో ఎన్ని సీట్లు గెలిస్తే మాత్రమేంటి నగరంలో ఒక్క సీటు కూడా లేకపోయిన తర్వాత ? అందుకనే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైసిపినే గెలుచుకోవాలని మంత్రి, ఎంపిల పై జగన్ పెద్ద బాధ్యతే పెట్టారట.

 

మేయర్ పీఠాన్ని గెలుచుకోవాలంటే అర్ధమేంటి ? మెజారిటీ కార్పొరేటర్లను గెలుచుకుంటే కానీ మేయర్ పీఠం దక్కదు కదా ? అదే సమయంలో తన పట్టు నిలబెట్టుకోవాలని ఒకవైపు టిడిపి, ఉనికి చాటాలని బిజెపి, బోణి కొట్టాలని జనసేన కూడా పావులు కదపటం మొదలుపెట్టాయి. మరి కొత్తగా మంత్రి, ఎంపిలైన అవంతి, ఎంవివిలు ఏం చేస్తారనే దానిపైనే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడుందనటంలో సందేహమే లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: