ఏపీ అసెంబ్లీలో రెండో రోజు గురువారం అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డిచింది.  ప్రతిపక్షనేత చంద్రబాబు-సభ నాయకుడు జగన్ ఒక‌రిపై ఒక‌రు తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ముఖ్యంగా స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంను స్పీక‌ర్ సీట్లో కూర్చోపెట్టేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌గా ఉన్న చంద్ర‌బాబు రాలేదు. దీనిపై స‌భ‌లో పెద్ద రాద్దాంత‌మే జ‌రిగింది. దీనిపై రెండు పార్టీల నేత‌లు మాట‌ల‌తో దాడి చేసుకున్నారు. 


అడుగడునా ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా అధికారపక్షం వ్యవహరించిందని.. ప్రజల తీర్పుతోనే ఇరువురికి ఈ స్థానాలు వచ్చాయన్నారు. గ‌తంలో మీ తండ్రి చేసిన త‌ప్పును ఒప్పుకోండి... మీరే అంటున్నారుగా తండ్రికి త‌గ్గ కొడుకు అని.. చ‌రిత్ర‌ను ఎవ్వ‌రూ మార్చ‌లేరు కదా ? అని చంద్ర‌బాబు అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా విబేధించిన జ‌గ‌న్ ఐదేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు తాను ఎలాంటి విలువ‌లు పాటించానో మీరు అంద‌రూ చూశారు క‌దా ? అని చెప్పారు. ప్ర‌భుత్వ చ‌ట్టాల‌కు తూట్లు పొడిచిన టీడీపీ ప్ర‌భుత్వం, త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్టు కొనుక్కుంద‌ని విమ‌ర్శించారు. 


ఇక నాటి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు కొమ్ముకాస్తూ ఆ ప‌ద‌వికే క‌ళంకం తెచ్చార‌ని కూడా విమ‌ర్శించారు. ఇదిలా ఉంటే బాబు చేసిన త‌ప్పునే తాను కూడా చేస్తే ఆయ‌న స‌భ‌లో ప్ర‌తిప‌క్ష హోదాలో కూడా ఉండేవారు కాద‌ని చెప్పారు. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే తాను టీడీపీకి చెందిన ఐదుమంది ఎమ్మెల్యేల‌ను లాక్కుంటే ఆ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఉండ‌ద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. 


ఇక చంద్ర‌బాబు త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను గ‌తంలో ప్ర‌లోభ‌పెట్టిన‌ట్టే.. తాను కూడా మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని ప్ర‌లోభ‌పెడితే... టీడీపీ నుంచి తనతో ఎంతమంది టచ్‌లో ఉన్నారో చెబితే.. తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. అయితే తాను మాత్రం ఈ అన్యాయ‌మైన సంప్ర‌దాయానికి స్వ‌స్తి ప‌ల‌కాల‌నే చంద్ర‌బాబు చేసినట్టు ఫిరాయింపుల‌ను ప్రోత్సహించ‌డం లేద‌ని చెప్పారు. అయితే చంద్ర‌బాబు గారు మాత్రం దీనిని కూడా వ‌క్రీక‌రిస్తున్నార‌ని జ‌గ‌న్ త‌ప్పుప‌ట్టారు. చంద్రబాబు చేసిన పని తాము చేయమని.. కుక్కతోక వంకర అన్నట్లు ప్రవర్తించడం దారుణమన్నారు. ఏదేమైనా సీఎంగా జ‌గ‌న్ రెండో రోజునే బాబుకు ధీటుగా సై అంటే సై అనే రేంజులో స‌మాధానం ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: