ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు విపక్ష టిడిపికి చ‌రిత్ర‌లో మర్చిపోలేనంత చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు చరిత్రలో లేనంత ఘోరమైన పరాజయాన్ని టిడిపి తాజా ఎన్నికలతో మిగిల్చుకుంది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకుంది. టీడీపీని చంద్రబాబు ఐదేళ్ల పాటు ఆ పార్టీ వాళ్లకి లెక్కలేనన్ని సందేహాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫలితాలు తీవ్రమైన నిరాశకు గురి చేయడంతో ఆ పార్టీ నుంచి గెలిచిన నేతలతో పాటు కొందరు సీనియర్ నేతలు బీజేపీలోకి జంప్ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి టిడిపిని టార్గెట్ చేస్తున్న బిజెపి జాతీయ నాయకత్వం తాజా టిడిపి దైన్యస్థితిని ఆసరాగా చేసుకుని ఆ పార్టీకి చెందిన కీలక నేతలపై వల వేసి వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. 


కేశినేని నాని లాంటి వాళ్ళు అయితే చంద్రబాబు బుజ్జగించినా ఫేస్‌బుక్ పోస్టులతో మాత్రం కలకలం సృష్టిస్తున్నారు.  కీలకమైన విజయవాడ లోక్‌స‌భ సీటు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వ‌రుస‌గా రెండోసారి విజయం సాధించిన నానికి జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాతో తీవ్రమైన వైరుధ్యం ఉంది. ఉమా ఒంటెద్దు పోకడలు ఎదుర్కోలేక చాలా మంది టిడిపి నేతలు ఐదేళ్లపాటు ఉగ్గబట్టుకుని ఉన్నారు. ఉమాకు చంద్రబాబు, లోకేష్ సైతం సపోర్ట్ చేస్తూ ఉండడంతో వీరంతా తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక అసంతృప్తితో ఐదేళ్ల పాటు అలాగే బండి నడుపుతూ వచ్చారు. 


ఇదిలా ఉంటే దేవినేని ఉమాతో ముందు నుంచి రాజకీయ వైరం ఉన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాత్రం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తూ సైలెంట్‌గా ఉండడం ఆశ్చర్యం గా ఉంది. కృష్ణా జిల్లా టిడిపిలో దేవినేని ఉమా బాధితుల్లో గద్దె రామ్మోహన్ కూడా ఒకరు. వాస్తవంగా ఈ ఎన్నికలకు ముందు దేవినేని ఉమా గద్దె రామ్మోహన్‌ను విజయవాడ ఎంపీగా బరిలో దింపి... విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్‌ను పోటీ చేయించాలని విశ్వప్రయత్నాలు చేశారు. 


గద్దె రామ్మోహన్ ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి రేసులో తనకు పోటీ వస్తారని భావించి... ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా గద్దెను ఎంపీగా పంపడంతో పాటు... కేశినేని నానికి సీటు లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. అయితే కేశినేని నాని వ్యక్తిగత ఇమేజ్ నేపథ్యంలో ఆయనను పక్కన పెట్టేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. ఈ ఎన్నికల్లో పార్టీ ఓడినా ఉమాకు రాజకీయ శత్రువులుగా ఉన్న కేశినేని నాని, గద్దె రామ్మోహన్ ఇద్దరు విజయం సాధించారు. ఓవైపు నాని ఫేస్బుక్ పోస్టులతో చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చి పెడుతుంటే గద్దె రామ్మోహన్ మాత్రం సైలెంట్‌గా ఉండటం ఎవరికీ అంతుపట్టడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: