ఏపీలో తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార వైసిపికి షాక్ ఇచ్చిన ఒకే ఒక జిల్లా విశాఖ. జిల్లాలోని రూరల్, ఏజెన్సీలోని అన్ని సీట్లు గెలుచుకున్న వైసీపీ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ నగరంలోని నాలుగు సీట్లలోను ఓడిపోయింది. ఇంత బలమైన నేప‌థ్యం ఉన్నప్పటికీ కూడా నగరంలోని నాలుగు సీట్లలో వైసిపి ఓడిపోవడం పార్టీ అధినేతకు సైతం మింగుడు పడని విషయం. విశాఖ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ సీట్లను తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో గెలిచింది. రాష్ట్రం మొత్తం వైసీపీ ప్రభంజ‌నం ఉంటే నగరంలోని నాలుగు సీట్లలో వైసిపి ఎందుకు ? ఓడిపోయింది అన్నదానిపై వైసీపీ సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే పోస్ట్‌మార్టం చేసి నివేదిక‌లు తెప్పించుకున్న‌ట్టు తెలిసింది. 


నగరంలో వైసీపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కొందరు వెన్నుపోటు పొడవడంతోనే ఈ నాలుగు స్థానాల్లో వైసిపి ఓడిపోయినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగన్ వద్దకు ఇప్పుడు ఇవే నివేదికలు వెళ్ళాడట. వాస్తవంగా చూస్తే విశాఖ సౌత్, ఈస్ట్ సీట్ల విషయంలో పార్టీ అధినాయకత్వం చేసిన కొన్ని లోపాల వల్ల కూడా ఈ రెండు చోట్ల వైసిపి అభ్యర్థులు ఓడిపోయారు. విశాఖ సౌత్‌లో ముందురోజు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌కు సీటు ఇచ్చారు. రాత్రికి రాత్రే కండువా కప్పుకున్న వ్యక్తికి సీటు ఎలా ఇస్తారు అన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమయ్యాయి. దీంతో ఆయనకు అక్కడ టికెట్ ఆశించిన కొందరు నేతలు శ్రీనివాస్‌కు సపోర్ట్ చేయకపోవడంతో గట్టి దెబ్బ పడింది. 


ఇక ఈస్ట్‌లో బలమైన నేతగా ఉన్న నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కాదని అప్పటివరకు భీమిలి ఇన్‌చార్జిగా ఉన్న అక్రమాని విజయనిర్మలకు ఈ సీటు ఇవ్వడంతో ఆమెకు స్థానిక నేతల్లో చాలామంది సపోర్ట్ చేయలేదు. దీంతో బలమైన నేతగా ఉన్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వరుసగా మూడో గెలుపు సులువుగా సాధించారు. ఇదిలా ఉంటే నగర వైసీపీ అధ్యక్షుడుగా ఎక్కువ కాలం ఉన్న మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ వెస్ట్ నియోజవర్గంలో పార్టీని ఏ మాత్రం పటిష్టం చేయలేకపోయారు. పార్టీ కేడర్‌ను పూర్తిగా గాలికి వదిలేయడంతో వెస్ట్‌లో టీడీపీకి ఏకంగా 26 వేల‌ భారీ మెజార్టీ వచ్చింది. ఇక్కడ టిడిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు బలమైన నేతగా ఉన్నారు. ఆయనను ఎదుర్కోవడంలో మళ్ల‌ విజయప్రసాద్ ముందు నుంచి నిర్లక్ష్య పూరితమైన ధోరణి అవలంబించారు అన్న విమర్శలు సొంత పార్టీ నేతల్లోనే ఉన్నాయి. 


ఇక నార్త్ లో వైసీపీ నుంచి పోటీ చేసిన కేకే. రాజు మంత్రి గంటాను దాదాపు ఓడించడం అంత పని చేశారు. గంటా చివరి వరకు ఓటమి బాటలోనే ఉండి చివరిలో గట్టెక్కారు.  కేకే. రాజు నియోజకవర్గంలో పార్టీ నేతలను సమన్వయం చేసుకోలేక పోవడం ఒక మైనస్ అయితే... చివర్లో కీలక నేతలు టీడీపీలోకి జంప్ అయినా ఆయన లైట్ తీసుకున్నారు. లేకపోతే నార్త్ లో వైసీపీ ఖ‌చ్చితంగా గెలిచి ఉండేది. ఏదేమైనా విశాఖ నగరంలో వైసిపి ఫలితాలపై తీవ్ర నిరుత్సాహంతో ఉన్న జగన్ ఎలాగైనా జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఇప్పటికే నగర పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు ఎంపీ ఎంవీవీ.స‌త్య‌నారాయ‌ణ‌కు సైతం మీరేం చేస్తారో నాకు తెలియదు విశాఖ మేయ‌ర్ పీఠం ఎలాగైనా మ‌న ఖాతాలోనే పడాలని సీరియస్‌గా కూడా వార్నింగ్ ఇచ్చిన‌ట్టు సమాచారం. ఇక ఈ ఎన్నికల్లో నగరంలో సొంత పార్టీ నేతలను ఓడించేందుకు వెన్నుపోటు పొడిచిన వారిపై త్వరలోనే జగన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: