ఆరు నెలల క్రితం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మహాకూటమి ఎంత చిత్తుగా ఓడిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ కాంగ్రెస్ కాస్తోకూస్తో పోటీ ఇస్తుందని అందరు అనుకుంటున్న టైంలో చంద్రబాబు ఎప్పుడైతే కాంగ్రెస్‌తో జట్టుకట్టాడో కాంగ్రెస్ చరిత్రలోనే ఘోరమైన ఓటమిని మూటకట్టుకుంది. ఇక తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు పరిస్థితి ఏంటో అందరూ చూశారు. చంద్రబాబు గత ఏడాది కాలంగా ఎక్కడ అడుగుపెడితే అక్కడ రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 


అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తాజాగా వచ్చిన లోక్ సభ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. లోక్‌స‌భ ఎన్నికలలో టీ కాంగ్రెస్‌కు 3 ఎంపీ సీట్లు దక్కాయి. ఇక మరో నాలుగు ఎంపీ స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఏపీలో జగన్ సాధించిన అప్రతిహత విజయంతో ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతల్లో వారి పాలిట జగన్ దేవుడుగా కనిపిస్తున్నాడు. కాంగ్రెస్ నేతలందరూ జగన్ నామస్మరణ చేస్తున్నారు. జగన్ మావాడే కదా అని గొప్పలు చెప్పుకుంటున్నారు. 


జగన్ మాదిరిగా కష్టపడితే తెలంగాణలో కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లుకు పైగా వస్తాయని ఒక సీనియ‌ర్ కాంగ్రెస్ నేత చెబితే, జగన్ ప్రజల్లోకి వెళ్లిన‌ట్టు మ‌నం కూడా వెళితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను మట్టికరిపించి తాము అధికారంలోకి వస్తామన్న మరో సీనియర్ నేత, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన మరో సీనియర్ నేత జీవ‌న్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ను చూసి కేసిఆర్ బుద్ధి తెచ్చుకోవాలని చెబుతున్నారు. సంక్షేమ పథకాలు, విద్య, వైద్య రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని జీవన్ రెడ్డి కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. 


విచిత్రమేంటంటే జగన్‌ను ప్రస్తుతం తమవాడిగా ఫీలవుతున్న‌ టీ-కాంగ్రెస్ నేతలు అందరూ గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి... ఆ తర్వాత గెలిచిన వారు జగన్ ప్రస్తావన తెస్తే కేసీఆర్ సహజంగానే అదిగో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ సెంటిమెంట్ లేవనెత్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ కూడా జగన్‌ను ఏమి అనే ప‌రిస్థితి లేదు. అందుకే టీ- కాంగ్రెస్ నేత‌లంద‌రూ జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చి కేసీఆర్‌ను వ్యూహాత్మ‌కంగా ఇరుకున పెడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇక ఫైన‌ల్‌గా ఏపీలో జ‌గ‌న్ సాధించిన విజ‌యం టీ కాంగ్రెస్‌లో ముఖ్యంగా ఓ సామాజిక‌వ‌ర్గ నేత‌ల్లో మాత్రం కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు మంచి ఉత్సాహం ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: