ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేసే ప్రక్రియ స్పీడ్ అయింది. జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రతి లోక్‌స‌భ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలను కలిపి పార్వతీపురం కేంద్రంగా మరో జిల్లా చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన చూస్తే ఏపీ లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు ఉన్నాయి. కొత్త కేబినెట్ కూడా ఏర్పాటు అవ్వడం... అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కావడంతో జిల్లా ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కూడా రికార్డులను పరిశీలిస్తున్నారు.


తాజాగా ఇదే అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలతో కలుపుకుని మొత్తం ఇరవై ఐదు జిల్లాల్లో పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేస్తామని... హైదరాబాద్ కేంద్ర కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని చెప్పారు. ఇక రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ప్రక్రియ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఏపీలో కొత్త‌ జిల్లాల‌ ఏర్పాటు ప్ర‌క్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.


కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల పరిపాలన వికేంద్రీకరణ అవ్వటం మంచిదే అయినా జగన్ ప్రతి లోక్‌స‌భ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తా అని చెప్పడమే ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడేలా ఉంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఉదాహరణకు బాపట్ల లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. సంత‌నూత‌ల‌పాడు నియోజకవర్గంలోని మండలాలు ఒంగోలుకు సమీపంలో ఉన్నాయి. వీళ్లంతా బాపట్ల కు రావాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఇంకా చెప్పాలంటే ఒంగోలు కార్పొరేషన్ ప్రాంతంలో ఉన్న ఏరియాలో కూడా బాపట్ల ఎంపీ సీటు పరిధిలోకి వస్తాయి. అంటే ఒంగోలు న‌గ‌రానికి కిలోమీటరు దూరంలోనే ఉన్న వారిని ఒంగోలులో కాకుండా బాపట్ల జిల్లాలో కలిపితే వారు జిల్లా కేంద్రానికి రావాలంటే ఒక రోజు అంతా వృధా అవుతుంది.


ఇక్కడ పచ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, గిద్దలూరు, దర్శి, య‌ర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఒంగోలు రావాలంటే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. వీరికి ఒక రోజంతా ప్రయాణానికి సరిపోతుంది. దీంతో మార్కాపురం కేంద్రంగా తమకు కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక బాపట్లకు అద్దంకి ఏకంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అద్దంకిని బాపట్లలో కలిపితే చాలా ఇబ్బంది. దీంతో ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, చీరాల కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


ఇక రాజా మహేంద్ర వరాన్ని జిల్లా చేస్తే ఏలూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలాలు సైతం రాజమహేంద్రవరం జిల్లాలో కలుస్తాయి దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న కొన్ని మండలాల‌ ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. పక్కనే ఉన్న ఏలూరు కాదని ఎక్కడో ఉన్న రాజమహేంద్రవరంలో తమ కలిపితే ఊరుకోమని వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే రాజమండ్రికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం ఏలూరు జిల్లాలో ఉంటే... ఏలూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకాతిరుమల మండలంలోని గ్రామాలు రాజమహేంద్రవరం జిల్లాలో కలపాల్సి ఉంటుంది. ఇది పెద్ద తలనొప్పి లాంటిదే.


ఇక అరకు లోక్‌స‌భ సీటు నాలుగు జిల్లాల పరిధిలో ఉంది. తెలంగాణ నుంచి రంపచోడవరం నియోజకవర్గంలో కలిసిన మండలాలు జిల్లా కేంద్రానికి చాలా దూరంలో ఉంటాయి. దీంతో అర‌కు జిల్లా భౌగోళికంగా కరెక్టు కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.ఇక కృష్ణా జిల్లా లోని నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను ఏలూరు జిల్లాలో కలిపేందుకు అక్కడి ప్రజలు ఒప్పుకోవడం లేదు. ప్రకాశం జిల్లాలోని కందుకూరును నెల్లూరు జిల్లాలో.... నెల్లూరు జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లను తిరుప‌తి జిల్లాలో కలపటం కూడా భౌగోళికంగా సరికాదన్న‌ అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు నగరాన్ని ఆనుకుని ఉంటుంది. ఆ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి తిరుప‌తి జిల్లాలో కలపటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు క‌రెక్ట్ కాద‌న్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై జ‌గ‌న్ ఎలా పున‌రాలోచ‌న చేసి జిల్లాల‌ను మారుస్తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: