సోష‌ల్ మీడియాలో ఎంత స‌మాచారం వ‌స్తుందో....అందులో అంతే శాతం ఉద్దేశ‌పూర్వ‌కం, త‌ప్పుడు స‌మాచారం ఉంటుంది. ఉప‌యోగ‌ప‌డే స‌మాచారం కూడా ఎంద‌రికో మేలు చేస్తుంది. అయితే, ఏది స‌రైన‌ది, ఏది కాదు...ఏ స‌మాచారంతో ఇబ్బందులు ప‌డ‌తాం...దేనితో స‌మ‌స్య‌లు ఎదురుకావు అనే స్ప‌ష్ట‌త ఉండాలి. అలా లేకనే తాజాగా కొంద‌రు ఇబ్బందుల పాల‌య్యారు. తెలంగాణలో మిస్సింగ్‌ల వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్న తెలంగాణ యువ సైన్యం ఫేస్‌ బుక్ పేజీ అడ్మిన్‌ఫై కేసు నమోదు చేసి వెంకట్, బాలరాజు, క్రాంతి కిరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. 


తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మహిళలు, పిల్లలు అపహరణకు గుర‌వుతున్నార‌నే ప్ర‌చారంపై స్పందించారు. తెలంగాణలో దుష్ప్రచారం జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిస్సింగ్ కేసులలో చాలావరకు కుటుంబం, ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో ఫెయిలవడం, పిల్లలు తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోవడం, కుటుంబ సభ్యుల సంరక్షణ దొరకక తల్లిదండ్రులు వెళ్లిపోవడం వంటి కారణాల వల్ల నమోదౌతున్నాయని తెలిపారు. మిస్సింగ్ కేసులలో 85 శాతానికి పైగా ట్రేస్ చేశామని, మిగతావి ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజలలో భయాందోళనలు సృష్టించే విధంగా పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపింప చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 


ఇదిలాఉండ‌గా, బాలిక అదృశ్యమైన కేసు దర్యాప్తులో మధ్యప్రదేశ్ రాష్ర్టానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ తులసీరాం మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాబుల్‌రెడ్డినగర్‌లో నివాసం ఉండే లక్ష్మి కుమార్తె స్థానికంగా ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తుండేది. అక్కడే పనిచేసే రోషన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత ఏప్రిల్‌లో కుమార్తె కనబడ టం లేదని లక్ష్మి ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తుచేపట్టగా ఎంపీలోని డిండోడి జిల్లా సమన్మా గ్రామంలో ఉన్నట్టు తెలిసి, ఎస్‌ఐ రవీందర్‌నాయక్, కానిస్టేబుల్ తులసీరాం, డబ్ల్యూపీసీ లలిత బృందం ఈ నెల 8న అక్కడికి వెళ్లారు. అక్కడ సకితపూర్ పోలీసుల సహకారంతో బాలికతోపాటు రోషన్‌ను అదుపులోకి తీసుకుని తిరుగు పయనమ య్యారు. మంగళవారం సాయంత్రం వారు ప్రయాణిస్తున్న ఇన్నోవాకారు టైరు ఊడిపోయి బోల్తాపడింది. దీంతో కానిస్టేబుల్ తులసీరాంతోపాటు రోషన్ అక్కడిక్కడే మృతిచెందారు. ఎస్‌ఐ రవీందర్‌నాయక్, లలితకు తీవ్రగాయాలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: