ప్ర‌జాద‌ర‌ణ వేరు. నిర్వహణ వేరు. రాజకీయాలకు ప్రజాదరణ ఎంత ముఖ్యమో పార్టీని, నేపధ్యంలో ఉంటూ, విజయవంతంగా నియంత్రించటమూ అంతే ముఖ్యం. కొంద‌రు నేత‌లకు ప్రజాదరణ పెద్దగా ఉండదు. కాని వ్యూహ చతురతతో వెనక ఉండి క‌థ న‌డ‌ప‌టంలో వారి పాత్రెంతో కీలకం. ప్రజల మద్యలో ఉంటూ ప్రజాభిమానంతో పనులు చేయలేని కొందరు తెరవెనుక కార్య‌క్ర‌మాలు చ‌క్క‌బెట్ట‌టంలో వారికుండే నైపుణ్యం అంతా ఇంతా కాదు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రాం మాధవ్ అలాంటి అద్భుత నైపుణ్యం ఉన్న వ్యక్తుల కోవ‌కే చెందుతారు. 53 సంవత్సరాల వయసున్న రాం మాధవ్ పాత్రికేయుడు అనేక రాజకీయ గ్రంధాల రచయిత. దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ భౌగోళిక సాంప్రదాయ సామాజిక విషయాలపై సమగ్ర అవగాహన ఉన్న నిష్ణాతుడు నిపుణుడు. 
Image result for ram madhav amit shah narendra moDi
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు దాదాపుగా కనుమరుగవుతున్న వేళ ఆ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయటానికి, దక్షినాదిన కూడా తన ఉనికిని సాధించటానికి అనేక వ్యూహాలు పన్నుతుంది. ఈ వ్యూహాత్మక సమరానికి సర్వసైన్యాధ్యక్షుడుగా రా మాధవ్ నియామకం జరిగిపోయినట్లు సమాచారం. 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ, ఇతర పార్టీలలోని అసంతృప్తి నేతలను ఆకర్షించే పనిని బీజేపీ ప్రధాన కార్యదర్శి కీలక రాజకీయ వ్యవహారాల నిపుణుడు రామ్ మాధవ్ చేపట్టారు. మోడీ-షాల‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు విధేయుడు - బీజేపీ టాప్ అర్డ‌ర్ సంపూర్ణంగా న‌మ్ముకునే అత్యంత కీల‌కవ్య‌క్తుల్లో ఆయ‌న ఒక‌రుగా చెప్పుకునే రాం మాదవ్ తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీద దృష్టి సారించారు — బహుశ ఇది దక్షిణ భారతం మీద బీజేపి రాజకీయ దండ యాత్ర గా చెప్పవచ్చు. 

రెండు తెలుగు రాష్ట్రాల మీద స్పెష‌ల్ ఆప‌రేష‌న్ ద్వారా బీజేపి వ్యాప్తి బాధ్య‌త‌లు రాంమాధ‌వ్ కే పూర్తిగా అప్ప‌జెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం హైద‌రాబాద్ లోని స్టార్ హోట‌ల్ పార్క్ హ‌య‌త్ లో ఆయ‌న ఇప్పుడు మ‌కాం వేశారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఆయ‌న వివిధ పార్టీల ప‌లువురు నేత‌ల‌తో సమావేశమవటం ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో రాజ‌కీయంగా సంచ‌ల‌న‌మైంది.

ఆయ‌న సమావేశమైన తెలంగాణా నేత‌ల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ కి చెందినవారు  ఉండ‌టం చాలా ఆస‌క్తిదాయకంగా మారింది. 2023 లో తెలంగాణ‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే ల‌క్ష్యంగా చేసుకుని దానికి త‌గ్గ‌ట్లు బీజేపి అడుగులు వేస్తుందని  అంటున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే ఇప్పటికే కాంగ్రెస్లోని బ‌ల‌మైన నేత‌ల్ని కమలం పార్టీ లో చేరేలాగా ప్రణాళిక సిద్ధం చేశారంటున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా వరుస సమావేశాలు జ‌రుగుతున్నాయ‌ని వినిపిస్తోంది.

తాజాగా రాంమాధ‌వ్ తో సమావేశం అయిన వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆయ‌న సోద‌రుడు మోహ‌న్ రెడ్డి పెద్ద‌ప‌ల్లి మాజీ ఎంపీ వివేక్, టీ-పీసీసీ మాజీ అధికార ప్ర‌తినిధి కేసీఆర్‌ అన్న కూతురు రేగుల‌పాటి ర‌మ్యారావు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు చేవెళ్ల ఎంపీ స్థానానికి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఓట‌మి పాలైన కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఏపీ టీడీపీకి చెందిన కొంద‌రు నేత‌లు  ఉన్న‌ట్లుగా స‌మాచారం. 

తాజా భేటీ రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయ‌ని చెప్పాలి. స్టార్ హోట‌ల్లో గుట్టుచ‌ప్పుడు కాకుండా చాపకింద నీరులా బీజేపి వ్యాప్తి చెందే క్రమంలో జ‌రిపిన రాజ‌కీయ సమావేశాలు కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర తీయ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.  అయితే తెలంగాణలో బీజేపీ అడుగులు కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టేలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంతో పాటు ఆ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయగా, ఇప్పుడు టీఅరెస్ లో చేరలేని మరికొందరు నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న పలువురు నేతలు బీజేపితో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. 

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటప్పటికీ నేతలు ఆయన వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఆంతేకాదు రాం మాధవ్ ను నేనెప్పుడూ చూడలేదని కూడా ముక్తాయించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకునే అవకాశం లేకపోవడంతోనే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి బీజేపీ చర్చలు ఫలించి ఎవరైనా నేతలు ఆ పార్టీలో చేరతారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: