తమ్ముడు జగనా,
వ్యవసాయం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మంచిది.
చాలా మంది బ్లాక్‌మనీ ఉన్నవాళ్ళు తమ పెట్టుబడులను భూమి మీద పెట్టి లాభాలను గడిస్తున్నారు.
ఆ భూముల్లో వాళ్ళు పండ్ల తోటలో, వ్యవసాయమో చెయ్యకుండా యూకలిప్టస్ చెట్లు నాటి, ఐదేళ్ళు పోయాకా నరుక్కుందామని  ఆలోచిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా దాని ఎదుగుదలకు పెద్దగా నష్టం ఉండదని, చాకిరీ ఉండదని అలా చేస్తున్నారు. వాళ్ళను చూసి ఏమి చేసినా కలిసిరావడం లేదని చిన్న రైతులు కూడా అదే పని చేస్తున్నారు.
దాని వలన ఆ ప్రక్కన చిన్న చిన్న పండ్ల తోటలు వేసుకున్న రైతులు నష్టపోతున్నారు. 


ఈ యూకలిప్టస్ చెట్లు ఉన్నచోట భూగర్భజలాలు అడుగంటుతాయి. దాని వలన వర్షాధారంగా పెంచుకుంటున్న తోటలు దిగుబడులు లేక ప్రక్క రైతులు నష్టపోతున్నారు. ఇది నేను గత మూడు సంవత్సరాలలో గమనించాను. నర్సీపట్నం చుట్టుప్రక్కల జీడిమామిడి తోటలు ఎక్కువ. ఆ తోటల మధ్యలో యూకలిప్టస్ చెట్లు పెంచడం మొదలుపెట్టే సరికి ఆ చుట్టు ఉన్న జీడితోటల్లో దిగుబడులు చాలా ఆందోళనకర స్థాయిలోకి పడిపోయాయి.

మీరు  దీని మీద నిజాయితీపరులతో కూడిన ఒక కమిటీని వెయ్యండి.  దానికనుగుణంగా చర్యలు తీసుకోండి . ఈ చెట్లు ఉన్న చోట విధ్వంసం జరుగుతుందని పలు శాస్త్రవేత్తల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రైతు పరిస్థితి ఈ యూకలిప్టస్ భూతం వలన ఇంకా దిగజారుతోంది. 
మీరు కట్టే పోలవరాలు ప్రతీ మూలకూ నీళ్ళు అందించలేవు. నూటికి యాభై శాతం పైన వర్షం మీద ఆధారపడిన భూములే. అక్కడి రైతుల గురించి ఆలోచించండి . వీలైతే మన రాష్ట్రంలో యూకలిప్టస్ పెంపకాన్ని రద్దు చెయ్యండి.


ఇక్కడ అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే, ఈ యూకలిప్టస్ చెట్లు పెంచకుండా చెయ్యడానికి ఏమి చెయ్యాలో చెప్పండి. 
 సారవంతమైన భూముల్లో కూడా వీటిని పెంచుతున్నారు. కాగితపు పరిశ్రమలు వీటిని ప్రోత్సహిస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వెయ్యవలసిన అవసరం ఉంది.
 రైతుల కష్టాలను పెద్దమనుసుతో ఆలోచించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తారని  ఆశిస్తూ....
 ఇట్లు ఒక రైతు,
 ఆంధ్రప్రదేశ్‌


మరింత సమాచారం తెలుసుకోండి: