తెలంగాణలో గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోజులకు పైగా గ్యాప్ తీసుకున్న సీఎం కేసీఆర్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. సంక్రాంతికి తెలంగాణ మంత్రివర్గం కొలువు దీరింది. అయితే కేసీఆర్ పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు. లోక్‌స‌భ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్న కెసీఆర్‌కు తెలంగాణ ఓటరు అదిరిపోయే షాక్ ఇచ్చారు. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లకు 16 సీట్లు ఖ‌చ్చితంగా గెలుస్తామని ముందు నుంచి టిఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి. అందుకే సారు... కారు... 16... ఢిల్లీలో తెలంగాణ సర్కారు అంటూ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ నాయకులు అంతా నానా హడావిడి చేశారు.


తీరా ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్‌కు కేవ‌లం 9 సీట్లే వ‌చ్చాయి. అందులో రెండు సీట్లు స్వ‌ల్ప మెజార్టీతో గెలుచుకుంది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా కాంగ్రెస్ మూడు, బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి. మంత్రివ‌ర్గ కూర్పు తొలివిడ‌త‌లో కేసీఆర్ త‌న కుమారుడు కేటీఆర్‌కు, మేన‌ళ్లుడు హ‌రీష్‌రావుకు కూడా చోటు ఇవ్వ‌లేదు. ఇక ఇప్పుడు జ‌రిగే విస్త‌ర‌ణ‌లో వీరిద్ద‌రికి చోటు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజ‌కీయాల‌పై లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు క్ర‌మ‌క్ర‌మంగా కేటీఆర్ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తూ వ‌చ్చింది.


లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కేసీఆర్ వైఖ‌రిలో కాస్త మార్పు వ‌చ్చిందంటున్నారు. పార్టీలో హ‌రీష్‌కు కూడా ఎక్క‌డా లోటు లేకుండా ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే ఓ ఎమ్మెల్యేకు మంత్రి ప‌ద‌వి ఇచ్చే విష‌యంలో ఇప్పుడు కేసీఆర్ వ‌ర్సెస్ కేటీఆర్ మ‌ధ్య లైట్‌గా వార్ స్టార్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తన మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. దీంతో అక్కడ ఎవరిని మంత్రిని చేస్తారన్న ప్రశ్న ఆసక్తిగా మారింది.


గ‌త కేబినెట్‌లో ఈ జిల్లా నుంచి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు కేసీఆర్ త‌న కేబినెట్‌లో చోటు ఇచ్చారు. ఈ సారి ఆయ‌న పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తుమ్మ‌ల‌కు ఈ సారి మంత్రివ‌ర్గంలో చోటు ఇవ్వ‌లేనని తేల్చేశార‌ట‌. దీంతో ఇప్పుడు క‌మ్మ సామాజిక‌వ‌ర్గ కోటాలో ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్‌కుమార్‌కు చోటు ఇవ్వాల‌ని కేటీఆర్ ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. అజ‌య్‌ కాంగ్రెస్ పార్టీ లోంచి 2014 గెలిచారు. ఆ తర్వాత కారెక్కారు. కేటీఆర్‌కు, పువ్వాడ‌కు మ‌ధ్య బిజినెస్ డీలింగ్స్ కూడా ఉన్నాయ‌ట‌. కేటీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతోనే కేటీఆర్ అజ‌య్‌కే మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌.


ఇక కేసీఆర్ లెక్క వేరేగా ఉంద‌ని తెలుస్తోంది. ఈ జిల్లా నుంచి మంత్రి ప‌దవి కోసం రెండో రేసులో సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు. ఈయన టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత మంత్రి పదవి హామీతోనే కారెక్కారు. ఎస్సీ సామాజికవర్గ కోణం కూడా ఈయనకు మంత్రి పదవి ఇవ్వడానికి కలిసివస్తుంది. సండ్ర‌, కేసీఆర్ స‌న్నిహితులే. సండ్ర స‌త్తుప‌ల్లి నుంచి ఓట‌మి లేకుండా వ‌రుస‌గా మూడుసార్లు గెలిచారు. ఆయ‌న 1994లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో సండ్ర‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే అటు త‌మ్మ‌ల‌ను సంతృప్తి ప‌ర‌చిన‌ట్టు ఉండ‌డంతో పాటు ఆయ‌న సీనియార్టీకి న్యాయం చేయ‌డం, ఇటు సామాజిక కోణంలో అంద‌రిని క‌లుపుకుపోయే వ్య‌క్తిగా ఉండ‌డం క‌లిసి వ‌స్తుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. ఏదేమైనా ఈ ఇద్ద‌రి మాట‌లో ఎవ‌రు వీరిలో త‌మ మాట నెగ్గించుకుంటారో ?  సండ్ర‌, అజ‌య్‌లో ఎవ‌రికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: