దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భారీ వాగ్ధానాలు చేసిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెడుతున్న తొలి వార్షిక బడ్జెట్‌లో ఈసారి మాత్రం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఎంతవరకు ఇస్తుందో తెలియనుంది. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల కష్టాలకు బీజేపీ పెద్దపీట వేసింది. దీంతో సీతారామన్‌ తన తొలి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఆర్థిక పరమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన రైతు వర్గాలు కాకుండా ఇప్పుడు అదనంగా మరో ఐదు కోట్ల మంది కర్షకులకు ఈ నగదు బదలీ పథకాన్ని వర్తింపచేయనున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై రూ.87 వేల కోట్ల భారం పడనుంది. వ్యవసాయ గణాంకాల ప్రకారం మొత్తం 14.5 కోట్ల మంది రైతులకు ఈ పథకం లబ్ధి చేకూర్చనుంది.


అయితే దేశంలో రైతులకు లబ్ధి చేకూర్చడం కేంద్ర ప్రభుత్వానికి అంత తేలికైంది కాదని చెప్పాలి. ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు పరిమిత స్థాయిలో ఉంటాయి. మధ్యంతర బడ్జెట్‌లో జీఎస్టీ ద్వారా 18 శాతం ఆదాయం, వ్యక్తిగత ఆదాయం, వ్యక్తిగత ఆదాయపన్ను ద్వారా 32 శాతం, కార్పొరేటర్‌ పన్ను కింద 15 శాతం ఆదాయం లభిస్తుందని మధ్యంతర బడ్జెట్‌లో అంచనా వేశారు. అయితే ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఆర్థిక లక్ష్యాలను చేరడం అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కనీస మద్దతు ధర, ఆహార ధాన్యాల సేకరణ, ఆహార సబ్సిడీ కారణంగా కేంద్ర ప్రభుత్వంపై మరింత భారం పడనుంది. జాతీయ చిన్న పొదుపు నిధి నుంచి ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న రుణం రూ.1.81 లక్షల కోట్లు ఉంటుందని ఒక అంచనా. 2019 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌సీఐకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.4 లక్షల కోట్లు రావాల్సి ఉంటే, కేవలం రూ.80 వేల కోట్లు మాత్రమే మంజూరయ్యాయి.

ఇప్పుడు కాకపోయినా తరువాత అయినా ఆహార సబ్సిడీ బిల్లును కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే. నేషనల్‌ హౌసింగ్‌ బోర్డ్‌, నాబార్డ్‌, రూరల్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ ద్వారా వివిధ రంగాల్లో ప్రభుత్వం చేసే వ్యయం బడ్జెట్‌లో ప్రతిఫలించదు. మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత గాలికుంటు వంటి వ్యాధులను నివారించడానికి పెద్ద యెత్తున వాక్సినేషన్‌ చేయించాలని లక్ష్యాంగా పెట్టుకున్నారు. ఈ వ్యాధుల కారణంగా పాల ఉత్పత్తి ఏడాదికి ఏకంగా రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు ఐకార్‌ అంచనా వేసింది. నిజానికి ఈ వ్యాధులకు టీకా కార్యక్రమం 2004 నుంచి 2016 కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించారు. పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యాక్సినేషన్ల వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజించారు. కేంద్రం వాటా అరవై శాతంగా, రాష్ట్రాల వాటా 40 శాతంగా నిర్ణయించారు. దీంతో గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమం కుంటుపడింది. మహరాష్ట్రలో గాలికుంటు వ్యాధి కేసులు వెలుగు చూశాయి. 


కేంద్ర ప్రభుత్వమే వందశాతం వ్యయాన్ని భరిస్తూ గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం పూర్తి అయితే దేశంలో పాల ఉత్పత్తి మరింత పెరగనుంది. 2018లో ప్రపంచ పశు ఆరోగ్య సంస్థ దేశీయ పశు సంవర్దక సేవలకు ఒక మదింపు వేసి, లోపాలను అంచనా వేసింది. గాలికుంటు వ్యాధిని పూర్తి స్థాయిలో నివరిస్తే.. పశు సంవర్ధక సేవల్లో లోపాలు సరి అవుతాయని తేల్చి చెప్పడం విశేషం.


పశువుల వ్యాధుల కారణంగా భారతీయ మాంసానికి విదేశాల్లో గిరాకీ తగ్గింది. చైనా, అమెరికా, యురోపియన్‌ దేశాలు భారతీయ పశు మాంసంపై ఆంక్షలు విధిస్తున్నాయి. గాలికుంటు వ్యాధి నుంచి దేశీయ పశు సంపద పూర్తిగా విముక్తి చెందిందని నిరూపితమైతే.. చైనాతో సహా మిగిలిన దేశాల్లో ఎద్దు మాంసానికి గిరికీ పెరుగుతుంది. గాలికుంటు వ్యాధితో పాటు ఇతర పశు వ్యాధులపై ఈసారి కేంద్ర బడ్జెట్‌ ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: