తెలుగుదేశం పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేల్చిన బాంబ్‌తో టిడిపి నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. ఎవరికివారు వైసీపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరని ? ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. టిడిపిలో ఉన్నది 23 మంది ఎమ్మెల్యేలు... ఎనిమిదిమంది పార్టీ మారే చర్చల్లో ఉన్నారంటే.. ఇక మిగిలేది 15 మంది. దీంతో పార్టీలో ఉన్న వారిలో చాలామందికి ఒకరిపై ఒకరికి అనుమానాలు వస్తున్నాయి. కోటంరెడ్డి టిడిపి వాళ్ళలో అనుమానాలు రేకెత్తించేందుకు ఈ వ్యాఖ్యలు చేశారా ? లేదా నిజంగానే టిడిపి ఎమ్మెల్యేలు జగన్ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారా ? అని ఆరా తీస్తే టిడిపి ఎమ్మెల్యేలు కొందరికి ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి  పనులు చేయించుకోలేక నిరాశతో ఉండటం ఇష్టం లేదు... అందులోనూ టిడిపికి ఐదేళ్ల తర్వాత అయినా ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందన్న ఆశలు చాలామందికి లేవు.


దీంతో కొందరు ఎమ్మెల్యేలు ఎన్నికల ఫలితాలకు ముందు నుంచే వైసీపీ నేతలతో టచ్లో కి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న భారీ మెజారిటీ నేపథ్యంలో జగన్ టిడిపి ఎమ్మెల్యేలను తమ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇదిలా ఉంటే కోటంరెడ్డి 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.... ముగ్గురు ఎమ్మెల్సీల‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఒక రాజ్యసభ నేత కూడా రెండు నెలలుగా తమతో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆ పార్టీపై వేసిన‌ రెండో బాంబుగా మారింది.


కోటంరెడ్డి చెప్పినట్టు వైసీపీతో టచ్ లో ఉన్న టిడిపి రాజ్యసభ సభ్యుడు ఎవరు అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ‌ల‌ ప్రకారం టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ లేదా టిజి వెంకటేష్‌ల‌లో ఎవరో ఒకరు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారని... వీరు ఎప్పుడైనా వైసీపీలోకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చ‌ర్చించుకుంటున్నారు. వాస్తవానికి సీఎం రమేష్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. 1989లో కుప్పం ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు రమేష్ ఎన్నో విషయాల్లో చంద్రబాబుతో కలిసి నడిచారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వెంటే ఉన్నారు.


గత రెండు ఎన్నికల్లోనూ రాయలసీమ ఇన్‌చార్జి బాధ్యతలను చంద్రబాబు సీఎం రమేష్ కు అప్పగించారు. రాయలసీమలోని చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించిన సి.ఎం రమేష్ అక్కడ ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణమని సొంత పార్టీ నేతలే రమేష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక రమేష్ కు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాంట్రాక్ట్ల‌ నేపథ్యంలో పొరుగు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నేతలతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధంతో ఆయనపై తీవ్రంగా పార్టీ మారాలని ఒత్తిళ్లు వస్తున్నాయంటున్నారు. రమేష్ పార్టీ మారితే పెద్ద ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని టీడీపీ వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు.


ఇదిలా ఉంటే అధికారం ఎటువైపు ఉంటే అటువైపు వాలిపోయే వ్యక్తి ఆ పార్టీకే చెందిన మరో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. పలు పార్టీలు మరి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఆయన అక్కడ మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య‌ అండదండలతో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు టిడిపి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీలోకి జంప్ చేసి కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో త‌న‌ కుమారుడు భ‌ర‌త్‌కు సీటు కోసం నానా రచ్చ రచ్చ చేసి ఎలాగోలా చోటు దక్కించుకున్నారు. చివరికి ఈ ఎన్నికల్లో టీజీ కుమారుడు భ‌ర‌త్ కూడా ఓడిపోయారు. దీంతో ఇప్పుడు టీజీ వెంకటేష్ తన కుమారుడి భవిష్యత్తు తో పాటు... వ్యాపార లావాదేవీలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వైసీపీలోకి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదని టిడిపి వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆయ‌న్ను న‌మ్మేందుకు ఎంతమాత్రం లేదని కూడా టీడీపీ వాళ్లే అంటున్నారు. మరి ఈ ఇద్దరు నేతల్లో ఎవ‌రు ? వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు.. ఎవరు కండువా మార్చేస్తారు ? అన్న దానికి కాల‌మే సమాధానం చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: