ఏపీ అసెంబ్లీ తొలి స‌మావేశాల రెండో రోజునే అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ మ‌ధ్య పెద్ద యుద్ధం జ‌రిగింది. రెండో రోజు నుంచే టీడీపీ ఎటాక్ స్టార్ట్ చేయ‌డంతో వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డిగా టీడీపీపై ఎదురుదాడి చేసి వాళ్ల నోర్లు మూయించే ప్ర‌య‌త్నం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎంపికైన సీనియర్ నేత తమ్మినేని సీతారాంను.. స్పీకర్ కుర్చీ దగ్గరకు తీసుకు వెళ్ళేటప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాలేదని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ స్పీకర్‌ను ఎంపిక చేసేటప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కనీసం తమను సంప్రదించలేదని... అలా చేయ‌డం సంప్రదాయం అని... గతంలో తాను కోడెల శివప్రసాదరావు స్పీకర్గా చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్ర‌దించాన‌ని చెప్పారు.


చంద్రబాబు ఇచ్చిన కౌంటర్ పై వైసీపీ నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరకు వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఒక బీసీ నేతగా ఉన్న తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా చేసినందునే చంద్రబాబు సపోర్ట్ చేయలేదని... తన బంట్రోత్‌గా ఉన్న అచ్చెన్నాయుడును పంపించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై అసెంబ్లీలో చాలాసేపు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. తాను కూడా బలహీనవర్గాలకు చెందిన వ్యక్తినే అని... ఎమ్మెల్యేగా గెలిచిన తాను బంట్రోతు అయితే... అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ బంట్రోతు లేనా అని అచ్చెన్నాయుడు ప్రతి విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఇదే అంశంపై శుక్రవారం ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. 


ఎమ్మెల్యేల‌ను బంట్రోతులు అన‌డం క‌రెక్ట్ కాద‌న్న బాల‌య్య‌.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై కూడా త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం ఆశించినంతగా లేదన్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో చేతి వృత్తుల వారికి ఏం చేస్తారో ?  చెప్ప‌లేద‌ని..   అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజాప్రతినిధులు ప్రజలకు బంట్రోతులేనని బాలకృష్ణ స్పస్టం చేశారు. అందరూ ప్రజలకు సేవ చేయాల్సిందేనన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: