ఒక్క అవ‌కాశం.. అది కూడా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ఛాన్స్‌.. రావాల‌ని కోరుకునేవారు, వ‌చ్చాక త‌మ స‌త్తా చాటేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే, ఇలాంటి అవ‌కాశం ఏపీ ఏర్ప‌డిన వెంట‌నే అందిపుచ్చుకున్నారు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న టీడీపీ నాయ‌కులు, ఎన్నో మంత్రి ప‌ద‌వులు అనుభ‌వించిన నాయ‌కుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు గుంటూరు జిల్లాకు చెందిన నేత కోడెల శివ‌ప్ర‌సాద‌రావు. అయితే, ఆయ‌న ఈ ప‌ద‌వికి న్యాయం చేశారా ?  ఈ ప‌ద‌వికి ఉన్న హుందా త‌నాన్ని నిలుపుకొన్నారా? అంటే.. ఇప్పుడు మ‌లిసారి ఏర్ప‌డిన ప్ర‌భుత్వం నిర్వ‌హించిన తొలి స‌భ‌లో గ‌త స్పీక‌ర్‌గా ఉన్న కోడెల నిర్వాకాన్ని అధికార పార్టీ సభ్యులు ఏక‌రువు పెడుతుంటే.. కాపాడే నాధుడు కూడా క‌నిపించ‌ని ప‌రిస్థితిని బ‌ట్టి ఆయ‌న చేప‌ట్టిన‌ స్పీక‌ర్ ప‌ద‌వి ఎంత బాగా న‌డిచిందో ఇట్టే చెప్పొచ్చు. 


స్పీక‌ర్‌గా ఉన్న కోడెల త‌న బాధ్య‌త‌ల‌ను విస్మ‌రించి, అధికార పార్టీకి గులాం గిరీ చేశార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. స్పీక‌ర్ ఉన్న వారిలో ఎవ‌రో ఒక‌రో ఇద్ద‌రు మిన‌హా మిగిలిన వారంద‌రూ ఇలాగే చేయ‌డం స‌హ‌జం. అయితే న‌వ్యాంధ్ర తొలి అసెంబ్లీలో స్పీక‌ర్‌గా ఉన్న కోడెల మాత్రం ఐదేళ్ల పాటు అటు అసెంబ్లీలోనూ, ఇటు బ‌య‌టా కూడా ప్ర‌శంస‌లు కంటే విమ‌ర్శ‌లే కొని తెచ్చుకున్నారు. విప‌క్షానికి స‌భ‌లో ప్ర‌శ్నించే స‌మ‌యం కూడా ఇవ్వ‌కుండానే ఆయ‌న స‌భ‌ను న‌డిపించారు. విప‌క్ష స‌భ్యురాలు మ‌హిళ అని కూడా చూడ‌కుండానే ఏడాది పాటు ఆమెపై స‌స్పెన్ష‌న్ వేటు వేసి ఆనందించారు. ఇక‌, స‌భ‌లోనూ పార్టీ స‌మావేశం మాదిరిగానే ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసింది.


ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి 23 మంది స‌భ్యుల‌ను త‌న పార్టీలోకి తెచ్చుకుని, వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చినా.. స్పీక‌ర్‌గా ఆయ‌న చేతులు క‌ట్టుకుని ఉన్నారే త‌ప్ప‌.. ప్ర‌శ్నించ‌లేక పోయారు. నోరు విప్పితే. త‌న‌కు అయ్య‌దేవ‌ర కాళేశ్వ‌ర‌రావు మార్గ‌ద‌ర్శి అని చెప్పుకొనే కోడెల ఆ అయ్య‌దేవ‌రలో ఒక్క ఒక్క ల‌క్ష‌ణాన్ని కూడా పుణికి పుచ్చుకోలేక పోయారు. నేడు ఇదే విష‌యాల‌పై మాట్లాడుతూ.. క‌నీసం కోడెల పేరు కూడా తలుచుకునేందుకు అధికార ప‌క్షం ఇష్ట‌ప‌డ‌డం లేదంటేనే కోడెల మాన‌సికంగా రాజ‌కీయాల‌ను ఎంత‌గా భ్ర‌ష్టు ప‌ట్టించారో అర్ధ‌మ‌వుతోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌రీ ముఖ్యంగా గ‌తంలో స్పీక‌ర్లు వ్య‌వ‌హ‌రించిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌, ఆర్‌. సురేష్ రెడ్డి పేర్ల‌ను కూడా త‌లుచుకున్నా.. కోడెల పేరును ఎత్త‌కుండానే అధికార పార్టీ స‌భ్యులు ఆయ‌న‌పై దుమ్మెత్తి పోశాయి. ఈ ప‌రిస్థితిని క‌నుల‌తో చూస్తూ.. చెవుల‌తో వింటూ కూడా విపక్షంలో కూర్చున్న నాటి అధికార ప‌క్ష స‌భ్యులు ఖండించ‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి కోడెల స్పీక‌ర్ ప‌ద‌వినే బ్ర‌ష్టు ప‌ట్టించారా ?  ఇక ఆయ‌న‌కు మిగిలింది ?  రాజ‌కీయ స‌న్యాస‌మే అన్నది సుస్ప‌ష్టంగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: