చంద్రబాబునాయుడు ఇంకా ఓటమి దెబ్బ నుండి తేరుకున్నట్లు లేదు చూస్తుంటే. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘోర ఓటమికి కారణాలు తెలియటం లేదట.  కారణాలు ఎలా తెలుస్తాయి ? వాస్తవాలను అంగీకరించటానికి ఇష్టపడక ఆత్మవంచన చేసుకుంటే పార్టీకి భవిష్యత్తు కూడా ఉండదని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. గుంటూరులో పార్టీ నేతలతో చంద్రబాబు విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన, ఓడిన ఎంఎల్ఏలు, ఎంపిలతో సమీక్ష జరుగుతోంది లేండి.

 

చంద్రబాబు తాజా మాటలు వింటుంటే నిజాన్ని అంగీకరించలేని స్ధితిలో ఉన్నారన్న విషయం స్పష్టమైపోతోంది. ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు అన్నీ వ్యవస్ధలను నాశనం చేసేశారు. అవినీతి తారస్ధాయికి చేరుకుంది. టిడిపి ప్రజాప్రతినిధుల అరాచకాలు పెరిగిపోయాయి. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని  అసెంబ్లీలో ఎంతగా అవమానించారో అందరూ చూసిందే.

 

జనాలకు సంక్షేమ ఫలాలను అందించాల్సిన జన్మభూమి కమిటిలు మాఫియా లాగ తయారయ్యాయని టిడిపి నేతలే మొత్తుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇసుక, మట్టి, నీరు, భూమి ఇలా...దొరికన దేన్నీ వదలకుండా దోచేసుకున్నారు. పైగా 2014 ఇచ్చిన హామీల్లో దేన్నీ సంపూర్ణంగా అమలు చేయలేదు. దాంతో చంద్రబాబు పాలనపై జనాల్లో కసి పెరిగిపోయింది.

 

అదే సమయంలో జగన్ పాదయాత్రతో జనాల్లోకి వెళ్ళిపోయారు. 3681 కిలోమీటర్ల పాదయాత్రలో కోట్లమంది జనాలను కలుసుకున్నారు. వివిధ వర్గాలను పార్టీకి దగ్గరికి తీసుకున్నారు. దీని ఫలితంగా మొదటి నుండి టిడిపినే అంటిపెట్టుకుని ఉన్న బిసిలు మొదటిసారి వైసిపికి దగ్గరయ్యారు.

 

వైసిపిని 151 సీట్లలో గెలిపించారంటేనే చంద్రబాబుపై జనాల్లో ఏ స్ధాయిలో కసి పేరుకుపోయిందో అర్ధమైపోతోంది. అందుకే టిడిపికి ఘోర ఓటమి తప్పలేదు. అందరికీ అర్ధమైన ఈ విషయం చంద్రబాబుకు మాత్రం ఇంకా అర్ధం కాలేదట. అంటే తనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని అంగీకరించటానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు. కాబట్టి ఓటమిపై ఎన్ని సమీక్షలు పెట్టుకున్నా నిజాన్ని అంగీకరించనపుడు అన్నీ వృధానే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: