జూన్ 21 అనగానే ఇప్పుడు గుర్తుకు వచ్చేది ప్రపంచ యోగా దినోత్సవం..ఆ రోజు మన దేశంతో సహా దాదాపుగా ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.  దాదాపు 5000 ఏళ్ల క్రితం ఈ ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన కానుక... మహర్షి పతంజలి అందించిన యోగశాస్త్రం.


ప్రాచీన భారతంలో మునులు పాటించిన ఈ  యోగాసనాలను  దాదాపు 5 వేల ఏళ్ల తర్వాత కూడా ప్రపంచ దేశాలన్నీ పాటించడం యావత్ భారతీయులందరికి గర్వకారణం.   అసలు యోగా అనే పదం సంస్కృత‌ంలోని యుజ అనే దాని నుంచి వచ్చింది. యుజ అంటే చేరడం లేదా ఏకంచేయడం అని అర్థం. శరీరం, మనసును ఏకం చేయడమే యోగాలోని పరమార్థం. నిత్యం యోగా చేయడం ద్వారా శరీరాన్ని, మనస్సు ఏకమై  మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే ఒత్తిడిని అధిగమించడానికి, మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ప్రపంచం మొత్తం యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకుంటోంది. నగరాల దగ్గర నుంచి చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో సైతం యోగా, ప్రాణాయామ కేంద్రాలు ఏర్పడ్డాయి. ప్రజల్లో చక్కని ఆరోగ్యం కోసం యోగాసనాలు పాటించాలన్న అవగాహన పెరిగింది.


అయితే భారతీయులు ప్రాచీన కాలం నుంచి యోగాసనాలు పాటిస్తున్నా, ప్రపంచదేశాలన్నీ ఈ మధ్య కాలం నుంచే పాటిస్తున్నాయి.  2015 నుంచి ఏటా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. అసలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 న జరుపుకోవడం వెనుక ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం. అసలు  జూన్ 21 వ తేదీ ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజుగా మనందరికీ తెలుసు.. తొలిసారిగా 2014లో ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో  ప్రతిపాదించారు. 2014 సెప్టెంబరు 27 న ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ .. యోగాను వెలకట్టలేని అమూల్యమైన పురాతన భారతీయ సంప్రదాయంగా పేర్కొన్నారు.ఇది శరీరం, మనసును ఒక్కటిగా చేసి ఆలోచనలను, చర్యలను నియంత్రిస్తుంది.

వ్యక్తిలో నిగ్రహాన్ని పెంచి మనిషి, ప్ర‌కృతి మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుందన్నారు. ఆరోగ్యం, శ్రేయస్సుకు సంపూర్ణ విధానం యోగా... ఇది ఓ వ్యాయామం కాదు, కానీ వ్యక్తిలోని ఐక్యతాభావాన్ని ఆవిష్కరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి ఏటా జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనపై ఐరాస ఆమోదం తెలిపింది. 


ఐరాస ప్రకటన మేరకు తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించిన మొదటి యోగా దినోత్సవం వేడుకలకు 84 దేశాలకు చెందిన ప్రతినిధులు, దాదాపు 35,985 ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35 నిమిషాల పాటు 21 యోగసనాలు వేశారు. దీంతో రెండు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. ఒకేసారి 35,985 మంది యోగసనాలు వేయడం ఒక రికార్డయితే, 84 దేశాలు పాల్గొనడం మరో రికార్డు.


తాజాగా 5 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 21 (శుక్రవారం) న జరుపుకోనున్నారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్యోద్దేశం.  దాదాపు 192 దేశాల్లో ప్రజలు ప్రాణాయామం చేస్తూ, శ్వాసపై ధ్యాస పెడుతారు. యోగాసనాలు వేస్తూ దేహాన్నీ, మనస్సునూ నియంత్రణలోకి తెస్తున్నారు. శారీరక ఆరోగ్యానికీ, మానసిక ఉల్లాసానికి  సమగ్రమైన విధానం ఈ ప్రాచీన భారతీయ యోగశాస్త్ర విజ్ఞానమేనని ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. చూశారుగా..ప్రధాని మోదీ చేసిన కృషితో జూన్ 21 న ప్రపంచం మొత్తం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతుంది. ఇంకెందుకు ఆలస్యం..జూన్ 21 యోగా డేను జరుపుకుందాం..యోగసనాలు వేద్దాం..యోగా స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కలిగిద్దాం..ఏపీ హెరాల్డ్ వ్యూయర్స్ అందరికీ ముందస్తుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.


మరింత సమాచారం తెలుసుకోండి: