కాసేపట్లో ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి వెళ్లనున్నారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జనగ్ బయలుదేరారు. ఢిల్లీకి వెళ్లిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను సీఎం జగన్ కలువనున్నారు. కాగా రేపు ఢిల్లీలో జరుగబోయే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశంలో జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు.


అయితే ఇవాళ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని భూములు, విశాఖ భూకుంభకోణం, పోలవరం వంటి సాగునీటి ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, టీడీపీ మంత్రులపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాల్సిందిగా అమిత్‌షాను సీఎం జగన్ కోరనున్నట్లు సమాచారం. ఇక బీజేపీ పార్టీ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి వైసీపీకి ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై జగన్, అమిత్‌‌షాల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా  సీఎం హోదాలో జగన్ ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి.  


ఇక రేపు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగనున్న నీతి అయోగ్ సమావేశానికి సీఎం జగన్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిందిగా అభ్యర్థించనున్నారు.  మొత్తంగా సీఎం ఢిల్లీ పర్యటన పట్ల ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో  సీఎం  కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఏమైనా సాధించగలుగుతారా.. కేంద్రం నుంచి జగన్ ఎన్ని నిధులు తీసుకువస్తారు.. డిప్యూటీ స్పీకర్ పదవి స్వీకరించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు...చంద్రబాబుపై సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖను కోరనున్నారా..ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే రేపటిదాకా ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: