చంద్రబాబు హయాంలో చెలగేరిన కాల్‌మనీ కేటుగాళ్లు ఇప్పుడు మళ్లీ రాజధాని ప్రాంతంలో రెచ్చిపోతున్నారు.. టీడీపీ హయాంలో కాల్‌మనీ ఉదంతం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు..కొందరు వడ్డీవ్యాపారస్తులు చిరువ్యాపారులకు, మహిళలకు రుణాలు ఇచ్చేవారు.  లక్ష రూపాయల అప్పుకు  10 లక్షలు, 20 లక్షలు వడ్డీలు ఇవ్వాలంటూ వారిని వేధించి, ఆస్తులు, ఇండ్లు లాక్కుని , ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఆడవాళ్లను లైంగికంగా వేధించిన సంఘటనలు బయటపడడంతో నాడు రాజధాని ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.  కాల్‌మనీ పేరుతో కొందరు వడ్డీవ్యాపారస్థులుగా అవతారం ఎత్తిన టీడీపీ నేతల బినామీలు.. వడ్డీలు చెల్లించలేదంటూ ఎందరో అమాయక మహిళలు, పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలపై అత్యాచారాలకు  పాల్పడ్డారు. అంతే కాకుండా వారిని సెక్స్ రాకెట్‌లో దింపి ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడారు ఈ కాల్‌మనీ కేటుగాళ్లు.  కాల్‌మనీ నిర్వాహకుల ఆగడాలు భరించలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.


కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై నాటి ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో చంద్రబాబు సర్కార్‌ను నిలదీసింది. కాల్‌మనీ ఇష్యూలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఎమ్మెల్యే రోజాను చంద్రబాబు సస్పెండ్ కూడా చేశాడు. ఈ కాల్‌‌మనీ సెక్స్‌రాకెట్‌లో నిందితుల్లో స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే బోడెప్రసాద్, బుద్ధా వెంకన్న వంటి టీడీపీ నేతలు, వారి అనుచరుల పేర్లు వినిపించాయి. దీంతో అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తూతూమంత్రంగా విచారణ జరిపించి ఆ కేసును పక్కనపెట్టింది. తాజాగా కాల్‌మనీ కేసులో ప్రధాన నిందితులు అంతా మళ్లీ యధేచ్చగా చెలరేగిపోతున్నారు. అయితే ఏపీలో వైయస్  జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాల్‌మనీ నిందితులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించిన సందర్భంగా మళ్లీ రాజధాని ప్రాంతంలో కాల్‌మనీ సెక్సెరాకెట్ బాగోతాలు బయటపడడం సంచలనంగా మారింది.


 తాజాగా మైలవరంలో మళ్లీ కాల్‌మనీ కలకలం మొదలైంది.  అసలుతో పాటు వడ్డీలు లక్షల్లో కట్టినా..ఇంకా లక్షల్లో చెల్లించాలంటూ... కుంటముక్కలకు చెందిన వడ్డీ వ్యాపారి నుంచి నుంచి నోటీసులు రావడంతో బాధితులు న్యాయం చేయాలంటూ గురువారం మైలవరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మొరపెట్టుకున్నారు. కొన్నాళ్లుగా కాల్‌మనీ రాకెట్ మళ్లీ రెక్కలు చాచడంతో మైలవరం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది.పూర్తి వివరాల్లోకి వెళితే... మైలవరానికి చెందిన దారా వెంకట పుల్లారావు కాల్‌మనీ వడ్డీ వ్యాపారి వద్ద రూ.11 లక్షలు అప్పు తీసుకున్నాడు. గత ఏడు సంవత్సరాల నుంచి రుణదాతకు అప్పు చెల్లి స్తూనే ఉన్నాడు. బాధితుడు బ్యాంకు ద్వారా రూ.11 లక్షలు కట్టినట్లు ఆధారాలు కూడా చూపుతున్నాడు. అయినా సదరు వడ్డీవ్యాపారస్థుడు నుంచి మరో రూ.16.35 లక్షలు కట్టాలని కోర్టు నుంచి నోటీసులు అందాయి. దీంతో పుల్లారావు మరో వ్యక్తి వద్ద వడ్డీకి డబ్బులు తీసుకొని  2018లో రూ.3 లక్షలు కట్టా డు. అయితే 2019లో మరో రూ.3.50 లక్షలు కట్టాలని కోర్టు నుంచి నోటీసులు అందాయి. దీంతో బాధితులు లబోదిబోయంటూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమను కాల్‌మనీ వ్యాపారస్థుల నుంచి కాపాడాలంటూ పోలీసులకు మొర పెట్టుకున్నారు. 
 
ఇక మైలవరం శివాలయం కాంప్లెక్స్‌ లో హోటల్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వజ్రాల శిరీష అనే మహిళ  కాల్‌మనీ కింద  రూ.లక్ష తీసుకుంది. ప్రతి రోజు రూ.1,000 చొప్పున 100 రోజులు చెల్లించింది. అయితే మరో రూ.12,500లు వడ్డీ బకాయి తీర్చలేక పోయింది. దీంతో సదరు కాల్‌మనీ వడ్డీవ్యాపారస్థుడు రెండు చెక్కులు, నోట్లు అడ్డు పెట్టుకొని రూ.7.5 లక్షలు కట్టాలని వజ్రాల శిరీషకు నోటీసులు పంపాడు. దీంతో షాక్ తిన్న ఆమె కాల్‌మనీ అక్రమార్కుల నుంచి తనను కాపాడాలంటూ  పోలీసులను ఆశ్రయించింది. ఇక అదే వ్యక్తి వద్ద ఉప్పలపు సుజాత అనే చిరు వ్యాపారి కూడా రోజు వారి వడ్డీకి 2015లో రూ.50 వేలు తీసుకుంది. అయితే ఆర్థిక పరిస్థితులు బాగోలేక సుజాత బాకీ కట్టలేకపోయింది.  దీంతో సదరు వడ్డీవ్యాపారస్థుడు  2019 జూన్‌ నెలలో రూ.10 లక్షలు కట్టాలని నోటీసులు పంపాడు. దీంతో బాధితులంతా  పోలీసులను ఆశ్రయించి  తమను కాపాడాలంటూ ఫిర్యాదు చేశారు. దీంతో కాల్‌మనీ అక్రమాలపై విచారణ జరిపించి, వడ్డీవ్యాపారస్థులపై  చర్యలు తీసుకుంటామని మైలవరం పోలీసులు తెలిపారు. 


అయితే రాజధాని ప్రాంతంలోని టీడీపీ నేతలే మళ్లీ కాల్‌మనీ రాకెట్‌కు తెరతీశారని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కాల్‌మనీ రాకెట్ మళ్లీ రెక్కలు విప్పుకుంటుండడంతో రాజధాని ప్రాంతంలో భయాందోళన మొదలైంది. తక్షణమే ప్రభుత్వం కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ను పూర్తిగా నిర్మూలించాలని, మహిళల ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాల్‌మనీ కేటుగాళ్ల భరతం పట్టాలని, మరోసారి రాజధాని ప్రాంతంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ వినిపించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ను ప్రజలు కోరుకుతున్నారు. మొత్తంగా రాజధాని ప్రాంతంలో మళ్లీ  కాల్‌మనీ సెక్స్ రాకెట్ కలకలం రేపుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: