ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా  పరాజయం పొందిన  తెలుగుదేశం ఇప్పుడు   దిద్దుబాటు చర్యలు చేపడుతోంది .   పరాజయానికి కారణాలు అన్వేషిస్తోంది.  పార్టీ బతికి బట్ట కట్టాలంటే  బలమైన  వ్యూహకర్త అవసరమని    భావిస్తోంది.

 

అందులో భాగంగానే దేశంలో ప్రసిద్ధ ఎన్నికల  వ్యూహకర్తగా   పేరున్న ప్రశాంత్ కిశోర్   సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్  వైసిపి తరఫున  వ్యూహకర్తగా పని చేసిన సంగతి తెలిసిందే.  జగన్ పాదయాత్ర,  నవరత్నాల  పథకాలు,  ఎన్నికలలో  టిక్కెట్ కేటాయింపులు..  ఇలా అన్నింటిలోనూ   ప్రశాంత్ కిషోర్ టీం  కసరత్తు బాగా పని చేసినట్టు వార్తలు వచ్చాయి.

 

పోయిన చోటే  వెతుక్కోవాలి అన్నట్టు చంద్రబాబు ఇప్పుడు తెలుగు దేశం అభివృద్ధి కోసం ప్రశాంత్ కిషోర్ నే ఆశ్రయించాలని  నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో  జోరుగా  చర్చ సాగుతోంది.  ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్  సేవలు  వినియోగించుకోవాలని భావిస్తోంది.

 

మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను  బీహార్ రౌడీ అనే  తరహాలో విమర్శలు గుప్పించారు.  మరి ఇప్పుడు అదే చంద్రబాబు ప్రశాంత్ కిషోర్  సేవ కోసం   ప్రయత్నిస్తున్నారన్న వార్తలు అంత నమ్మశక్యంగా అనిపించవు.  కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని ఇప్పటికే పలు సార్లు రుజువు అయింది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: