మాజీ మంత్రి  గంటా శ్రీనివాసరావుకు తొందరలోనే సమస్యలు తప్పేట్లు లేవు. గతంలో జరిగిన భూకుంభకోణంలో గంటా ప్రముఖ పాత్ర పోషించినట్లు అనేక ఆరోపణలున్నాయి. తాజాగా అప్పటి భూ కుంభకోణాన్ని తవ్వి తీయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందట. నిజంగానే అది జరిగితే గంటా అడ్డంగా బుక్కైపోయినట్లే.

 

టిడిపి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో హుద్ హుద్ తుపాను వచ్చిన విషయం తెలిసిందే. దాని దెబ్బకు విశాఖపట్నం జిల్లాలో చాలా ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. అదే అదునుగా తర్వాత వేల కోట్ల రూపాయలు విలువైన భూ కుంభకోణం చోటు చేసుకుంది. హుద్ హుద్ దెబ్బకు కొన్ని నియోకవర్గాల్లోని భూ రికార్డులన్నీ కొట్టుకుపోయాయని అప్పట్లో రెవిన్యు అధికారులు చెప్పారు.

 

రికార్డులు కొట్టుకుపోయాయి కాబట్టి మళ్ళీ కొత్తవి తయారు చేసే సమయంలో వందలాది ప్రభుత్వ భూములను టిడిపి ప్రజా ప్రతినిధులు తమకు కావాల్సిన వాళ్ళ పేర్లతో రాయించేసుకున్నారు. అందులో మంత్రి గంటా తో పాటు  ఐదుగురు ఎంఎల్ఏల పాత్ర ఉన్నట్లు అప్పట్లోనే పెద్ద దుమారం రేగింది. రాబోయే సమస్యనుండి  తప్పించుకునేందుకే గంటా వైసిపిలోకి రావాలని అనుకుంటున్నారట.

 

వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణాన్ని అప్పటి మిత్రపక్ష ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు, స్వయానా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే బయటపెట్టటం పెద్ద సంచలనంగా మారింది. సొంత మంత్రే కుంభకోణంలో సహచర మంత్రి గంటా పాత్ర ఉందని చెప్పటంతో చంద్రబాబు సిట్ విచారణ చేయించారు. తర్వాత క్లీన్ చిట్ కూడా ఇప్పించుకున్నారు.

తాజాగా ఆ కుంభకోణంపై జగన్ దృష్టిపెట్టారని సమాచారం. అప్పట్లో ఇదే విషయమై జగన్ ప్రత్యేకంగా విశాఖపట్నం వెళ్ళి ధర్నాలో కూడా పాల్గొన్నారు. అలాంటి వేల కోట్ల రూపాయల కుంభకోణంపై మరోసారి దర్యాప్తు చేయాలని జగన్ నిర్ణయించటమంటే గంటాకు మూడినట్లే అనుకోవాలి. గంటాతో పాటు ఇంకెంతమంది ఎంఎల్ఏలు, తాజా మాజీల పాత్ర బయటపడుతుందో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: