మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా టిడిపి పరిస్థితి తయారైంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరాతి ఘోరమైన ఓటమితో టిడిపి నేతలు పదిహేను రోజులుగా బయటకు రాని పరిస్థితి ఎదురైంది. తలలు పండిన సీనియర్లు సైతం ఎలాంటి రాజకీయ అనుభవం లేని వైసీపీ జూనియర్ నేత‌ల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ ఓటమికి పోస్టుమార్టం చేసే పనిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే చంద్రబాబు అధ్యక్షతన ఎన్నికల్లో పార్టీ ఎందుకు ? ఓడిపోయింది మనం ఎక్కడెక్కడ తప్పులు చేశాం... అన్న అంశాలపై సమీక్ష నిర్వహించింది.


ఈ సమీక్షలో పలువురు సీనియర్లు పార్టీ ఓటమికి గల కారణాలను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఈ క్రమంలోనే కొందరు సీనియర్లు నేరుగా చంద్రబాబునే తప్పు పట్టినట్టు తెలుస్తోంది. ఐదేళ్ల టిడిపి పాలనలో పార్టీ ఎన్ని తప్పులు చేసిందో వారంతా ఓపెన్‌గానే చెప్పేశారట. ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అందరూ కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ పరంగా... ప్రభుత్వ పరంగా ఎలాంటి తప్పులు దొర్లాయో చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మెజార్టీ సీనియ‌ర్ నేత‌లు మాత్రం చంద్ర‌బాబుపైనే త‌మ అక్కుసు వెళ్ల‌గ‌క్కిన‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబుకు ఎప్పుడూ ఎద‌రు చెప్ప‌ని నేత‌లంతా ఈ రేంజులో ఫైర్ అయ్యారంటే ఆయ‌న‌పై ఇది తిరుగుబావుటా కిందే లెక్క అన్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి.


ఇక ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు వేల మందితో చంద్ర‌బాబు నిర్వ‌హించిన టెలీకాన్ఫరెన్స్‌లను తప్పు పట్టారు. వేల మందితో టెలీకాన్ఫరెన్స్‌ల వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మరో నేత జూపూడి ప్రభాక‌ర్‌రావు పార్టీలో హ్యూమ‌న్ ట‌చ్ మిస్ అయ్యింద‌ని త‌న అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డంతో పాటు పార్టీలో సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌ల‌కు చంద్ర‌బాబు దూర‌మ‌య్యార‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


ఇక ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ నివేదిక‌ల‌తో ప‌దే ప‌దే చంద్ర‌బాబు సంతృప్తి అంటూ చెప్పుకోవ‌డం కూడా కొంప‌ముచింద‌న్నారు. ఇక ఇప్పుడు గుంటూరు జిల్లాలో ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న కోడెల ట్యాక్స్‌పై ప్ర‌చార ప‌ర్వంలోనే జ‌నాలు ప్రస్తావించారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి తెలిపారు. గ్రామ స్థాయిలో నేతల అవినీతిపై బాబుకు చెప్పే అవకాశమే లేకుండా చేశారని, చంద్రబాబు చుట్టూ చేరిన బృందం వాస్తవాలు తెలియకుండా చేశారని దివ్యవాణీ వాపోయింది.  


ఇక చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన మూడు, నాలుగేళ్ల‌కు కూడా నామినేటెడ్ పోస్టులు భ‌ర్తీ చేయ‌లేద‌ని.. చాలా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని.. చివ‌ర్లో ఎన్నిక‌ల‌కు ముందు వీటిని భ‌ర్తీ చేయ‌డం ఒక మైన‌స్ అయితే... కొన్ని పోస్టుల‌ను ఖాళీగా రెండు, మూడేళ్లు వ‌దిలేయండంతో కార్య‌క‌ర్త‌ల్లో నిర్వేదం అలుముకుంద‌ని ప‌లువురు ఓడిపోయిన ఎమ్మెల్యేలు బాబు మీదే నిర్మొహ‌మాటంగా త‌మ అభిప్రాయంగా చెప్పేశారు. ఏదేమైనా ఈ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ఓట‌మిపై సీనియ‌ర్లు అంద‌రూ ఫైన‌ల్‌గా చంద్ర‌బాబునే త‌ప్పుప‌డుతున్నారు. ఇప్ప‌ట‌కీ అయినా చంద్ర‌బాబు త‌న తీరు మార్చుకుని కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌కు అందుబాటులో ఉంటే త‌ప్ప పార్టీ ముందుకు వెళ్ల‌డం క‌ష్ట‌మే అన్న అభిప్రాయం వ్య‌క్తం చేశార‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: