అసెంబ్లీ సాక్షిగా...ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. తాను ఫిరాయింపులను ప్రోత్సహించనని, ఒకవేళ ఎవరైనా తమ పార్టీలోకి వస్తే పదవులకు రాజీనామా చేసి రావాలని జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.విలువలకు కేరాఫ్ గా ఉండే అసెంబ్లీని తమ ప్రభుత్వం నడిపిస్తుందని… దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తర్వాత జగన్ మాట్లాడారు. గత అసెంబ్లీలో వైసీపీకి చేదు అనుభవాలు ఎదురయ్యాయంటూ వాటిని వివరించారు. గత అసెంబ్లీలో విలువల్లేని రాజకీయాలు చూశామనీ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయకుండా చట్టాలను తూట్లుపొడుస్తూ దిగజారిన వ్యవస్థను కూడా చూశామన్నారు. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని దిగజారిన వ్యవస్థను కూడా ఇదే చట్టసభలో చూశామన్నారు. తాను కూడా అలాగే చేస్తే.. అటువంటి అన్యాయమైన సంప్రదాయాన్ని పాటిస్తే మంచి అనేది బతకదు… రాష్ట్రం కూడా బాగుపడదు అన్నారు.


ఈ ప్ర‌క‌ట‌న‌పై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ జగన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాదిరిగా జగన్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే టీడీపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలరని దాడి అన్నారు. అందుకే టీడీపీ ఆఫీసులో జగన్ ఫోటో పెట్టుకొని చంద్రబాబు పార్టీని నడపాలని  చంద్రబాబు నీతినియమాలు, విధివిధానాలు లేని నాయకుడని విమర్శించారు. బాబుది రోజుకో మాట పూటకో విధానమని ఆయన ఆరోపించారు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించే నేతలను అనర్హులను చేసి, వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తానని జగన్ ప్రకటించడం దేశానికే ఆదర్శమని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: