తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 21న ప్రాజెక్టు స్థలి వద్ద శాస్త్రోక్త క్రతువులు, ఊరూరా సంబురాలు జరపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు హాజరవుతున్న ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయనున్నారు.

ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద మొదటి పూజ, హోమ క్రతువు ఉంటాయి. తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్‌ ప్రారంభోత్సవం ఉంటుంది. కన్నెపల్లి పంపుహౌజ్‌ వద్ద తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు మూడు పంపులకు స్విచ్‌ఆన్‌ చేస్తారు. అక్కడ 45 నిమిషాలపాటు పూజాకార్యక్రమం నిర్వహించనున్నారు. గోదావరి జలాలను గ్రావిటీ కాలువలో ఎత్తిపోసే స్థలం వద్ద అరగంటపాటు వైదిక క్రతువు ఉంటుంది.

కన్నెపల్లి పంపుహౌజ్‌ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరుణున్ని ఆహ్వానించే హోమం చేస్తారని తెలిసింది. ప్రారంభోత్సవం అనంతరం స్వామి సన్నిధానంలో గోదావరి జలాలతో ఆయన అభిషేకం నిర్వహిస్తారని సమాచారం. తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వర ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు శృంగేరి పీఠం పండితులు గోపీకృష్ణశర్మ, ఫణి శశాంక్‌శర్మ మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్‌ ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యమంత్రి నిర్వహించే ప్రత్యేక పూజలకు అనువైన స్థలాలను పరిశీలించారు.

పండితుల వెంట జయశంకర్‌ జిల్లా పాలనాధికారి వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్‌ ఉన్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద నిర్వహించనున్న యాగాలకు జలసంకల్ప యాగాలు అని నామకరణం చేశారు.  ప్రారంభోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో కన్నెపల్లి పంపుహౌజ్‌ వద్దకు సందర్శకుల ప్రవేశాన్ని నియంత్రించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: