తమకు వ్యతిరేకంగా ఉన్న ఏ చిన్న విషయాన్నైనా చిలవలు పలువలు చేసి రాద్దాంతం చేయటం తెలుగుదేశంపార్టీకి మొదటి నుండి ఉన్న అలావాటే. తాజాగా గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబునాయుడును సెక్యురిటీ చెక్ చేశారట. ఆయన వాహనాలను బయటే ఉంచేసి సాధారణ ప్రయాణీకులతో కలిసి మామూలు వాహనంలోనే విమానం వరకూ పంపారట.

 

ఇంకేముంది టిడిపి నేతలకు ఇష్యు దొరికేసింది నానా యాగీ చేయటానికి. నియమాలు, నిబంధనలు ఏవీ పట్టవు టిడిపి నేతలకు. తాము పట్టినదానికి మూడే కాళ్ళు అనే రకాలు. దాంతో చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో ఎదురైన అనుభవాన్ని చాలా పెద్ద ఇష్యు క్రింద చేసేశారు.  వాళ్ళ యాగీ సంగతి పక్కన పెడితే అసలు కథేంటి ? చంద్రబాబుకు సెక్యురిటీ చెక్ చేయవచ్చా ?

 

పౌర విమానయాన శాఖ నిబంధనల ప్రకారం సెక్యురిటీ చెక్ కు చంద్రబాబు అతీతుడేమీ కాదు. కచ్చితంగా ఆయన కూడా సెక్యురిటీ చెక్ చేయించుకోవాల్సిందే. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కొన్ని మినహాయింపులుండటం సహజం.  కాబట్టి మొన్నటి వరకూ సెక్యురిటీ చెక్ లేకుండా వెళ్ళేవారు. ఇపుడు సిఎంగా దిగిపోయినపుడు ఆ మినహాయింపులేవీ ఉండవన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే చంద్రబాబు కూడా సాధారణ ప్రయాణీకులు వెళ్ళిన వాహనంలోనే వెళ్ళారు, సెక్యురిటీ చెక్ చేయించుకున్నారు.

 

దేశం మొత్తం మీద సెక్యురిటీ చెక్ లేకుండా నేరుగా విమానంలోకి వెళ్ళిపోయే అవకాశం పౌర విమానయాన శాఖ జారీ చేసిన జాబితా ప్రకారం వివిధ హోదాల్లో ఉండే 33 మందికి మాత్రమే ఉంటుంది. అందులో రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ఎస్పిజి భద్రత ఉన్న వివిఐపిలతో పాటు మరికొందరు జాబితాలో ఉన్నారు.

 

ఆ జాబితాలో హోదా ప్రకారం చూసినా, వ్యక్తిగతంగా చూసినా చంద్రబాబు పేరు లేదు. కాబట్టి నిబంధనలు పాటించాల్సిందే. అంతెందుకు ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి కూడా సెక్యురిటీ చెక్ చేయించుకున్నవారే. ఇపుడు చంద్రబాబుకు మాత్రం ఎందుకంత అసహనంగా ఉంది. ఎందుకంటే తాను అందరికన్నా, వ్యవస్ధలకన్నా అతీతుడనని అనుకుంటుంటారు కాబట్టే. అధికారంలో ఉన్నపుడు అలాగే వ్యవహరించరు కాబట్టే జనాలు మాడుపగలగొట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంలోకి వచ్చినా ఇంకా చంద్రబాబు ఆలోచనలు మారినట్లు లేదు. అంటే చంద్రబాబు ఎప్పటికి మారడుగాక మారడని అర్ధమైపోతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: