అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న టీడీపీలో ఇప్పుడు స‌రికొత్త‌ టెన్ష‌న్ మొద‌లైంది. ఇప్పుడున్న కొద్దిపాటి పరువు కూడా పోతుందా..? అన్న ఆందోళ‌న పార్టీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఊహించ‌ని రీతిలో.. కోలుకోలేని తీర్పునిచ్చిన ప్ర‌జ‌ల్లో మ‌రింత ప‌లుచ‌న అవుతామా..? అని తెలుగు త‌మ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంత‌కీ.. టీడీపీలో ఎందుకింత ఆందోళ‌న‌.. అని తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే.. మీరు ఈ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం చ‌ద‌వాల్సిందే మ‌రి.  ఈ ఎన్నిక‌ల్లో గెలుపు త‌మ‌దేన‌ని చివ‌రి వ‌ర‌కూ ఎంతో ధీమాతో ఉన్న టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఘోర ప‌రాజ‌యం ఎదురైన విష‌యం తెలిసిందే.


ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ నంబ‌ర్‌తో ఆ పార్టీకి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కింది. అయితే.. వీరిలో కొంద‌రు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని అధికార వైసీపీ నేత‌లు అన‌డంతో చంద్ర‌బాబు గుండెళ్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల్లో జ‌గ‌న్ మాట్లాడుతూ.. విప‌క్ష ఎమ్మెల్యేలు త‌మ‌తో ఎంత‌మంది ట‌చ్‌లో ఉన్నారో చెప్ప‌నుగానీ.. నేను డోర్ తెరిస్తే.. అంతే.. అంటూ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీవ‌ర్గాల్లో ఆందోళ‌న క‌లిగించాయి. కానీ.. తాము ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌బోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కానీ... ఆ మ‌రుస‌టి రోజే వైసీసీ నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.


టీడీపీకి చెందిన 8 మంది ఎమ్మల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వీరిలో ఇద్దరు తనతో స్వయంగా సంప్రదింపుల్లో ఉన్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఒక‌వేళ‌.. వైసీపీ నేత‌లు చెబుతున్న‌ట్లుగా ప‌లువురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడితే.. ప్ర‌తిప‌క్ష హోదా గ‌ల్లంతేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ఉండాలంటే క‌నీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేల్లో క‌నీసం 5 గురు ఆ పార్టీకి గుడ్ బై చెపితే అసెంబ్లీలో టీడీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఉండ‌దు. ఈ ప‌రిణామాలే బాబు బెంగ‌కు కార‌ణంగా క‌నిపిస్తున్నాయి.


అంటే.. ఈ ఐదేళ్ల‌లో ప‌లువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా.. ఏక్ష‌ణ‌మైనా.. వైసీపీలోకి వెళ్లడం ఖాయంగానే క‌నిపిస్తుంద‌నే టాక్ తెలుగుత‌మ్ముళ్ల‌లో వినిపిస్తోంది. టీడీపీలో కాస్త గుణ‌గ‌ణాలు బాగున్న ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు జ‌గ‌న్ కూడా రెడీగానే ఉన్నారు. అయితే వీరు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌న్న కండీష‌న్ జ‌గ‌న్ పెట్టారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు ప‌ద‌వుల‌కు కూడా రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష హోదాను కాపాడుకునేందుకు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి మ‌రి.



మరింత సమాచారం తెలుసుకోండి: