ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తీవ్రమైన ఒత్తిడి రేపిన ఫలితం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఫలితం. ఇక్కడ నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన మల్లాది విష్ణు టిడిపి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావుపై కేవలం 25 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. చివ‌రి రౌండ్ వరకు తీవ్రమైన ఉత్కంఠ రేపిన ఈ  ఫలితంలో చివరకు విజయం వైసీపీ అభ్య‌ర్థి మ‌ల్లాదినే విజ‌యం వరించింది. ఈ గెలుపుపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్లాది విష్ణు గెలుపును సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. నియోజకవర్గంలోని 11 కేంద్రాల్లో వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించిన తర్వాతే ఫ‌లితం అధికారికంగా ప్రకటించాలని రిటర్నింగ్ అధికారిని కోరినా ఆయ‌న త‌మ మాట ప‌ట్టించుకోకుండా తుది ఫ‌లితం వెల్ల‌డించార‌ని ఉమా త‌న ఫిటిష‌న్‌లో పేర్కొన్నారు.


ఈ క్ర‌మంలోనే ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా ఉన్న వ్య‌త్యాసాల‌ను కూడా గ‌మ‌నించాల‌ని ఉమా పేర్కొన్నారు.  ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఈ విషయమై తాను జిల్లా ఎన్నికల అధికారికి వినతి పత్రం కూడా సమర్పించాన‌ని... ఫలితాల ప్రకటనకు ముందే వీవీ ఫ్యాట్ల స్లిప్పులు లెక్కించాకే ఫ‌లితాలు ప్ర‌క‌టించాల‌ని  చెప్పినా వారు కూడా త‌న విన‌తిని పట్టించుకోలేదని తన పిటిషన్లో తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు వ్యవహరించేలా ఎన్నికల అధికారిని ఆదేశించాలని కూడా ఉమా హైకోర్టును కోరారు. బొండా ఉమా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది.


తిరుపతిలో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా ఎన్నికల ఫలితాలపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ ముందు నుంచి ఆధిక్యంలో ఉన్నారు. 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఆమె వెనకబడ్డారు. 13వ రౌండ్ లో అధికారులు తనను అయోమయానికి గురి చేసి తాను ఓడిపోయినట్లు ప్రకటించారని ఆమె ఆరోపించారు.

అలాగే టీడీపీకి అనుకూలంగా వచ్చిన 388 పోస్ట‌ల్ ఓట్ల‌ను సైతం సిబ్బంది లెక్కించలేద‌ని.... మరికొన్నింటిని ప‌క్క‌న పెట్టార‌ని.. ఓట్ల లెక్కింపు సమయంలో కొందరు ఎన్నికల అధికారులు వైసిపికి అనుకూలంగా వ్యవహరించారని కూడా వాపోయారు. ఏదేమైనా ఎన్నికల ఫలితాలు వచ్చి టిడిపి రాష్ట్రం అంతటా ఘోరంగా ఓడిపోయినా... ఆ పార్టీ నుంచి ఓడిపోయిన నేతలు మాత్రం ఈవీఎంలు, వీవీ ఫ్యాట్ల త‌ప్పు అంటూ ఇంకా హంగామా చేస్తూనే ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: