ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేస్తే చేర్చుకోబోమని, రాజీనామా చేస్తే తీసుకుంటామనే ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. ప్ర‌ధానంగా తెలంగాణ‌లో ఈ అంశం కేంద్రంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వివిధ వర్గాలు విరుచుకుప‌డుతున్నాయి. ఒక‌రి వెంట మరొక‌రు విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన ద్వారానైనా తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్‌రావుకు గుణపాఠం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఈ మేరకు చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అంతకుముందు సీపీఐ నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. 


తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో విపక్ష ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి అధికార పార్టీలు చట్టవిరుద్ధంగా ఫిరాయింపులకు పాల్పడుతూ రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయని చాడా వెంక‌ట‌రెడ్డి మండిప‌డ్డారు.  ఈ నేపథ్యంలో జగన్‌ చేసిన ప్రకటన ప్రశంసనీయమని తెలిపారు. జ‌గ‌న్ నిర్ణయం నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడి లక్షణమని  తెలిపారు.  జగన్‌ ప్రమాణస్వీకారం రోజు వయస్సు చిన్నది పదవి పెద్దది అని కేసీఆర్‌ అన్నారని పేర్కొన్నారు. జగన్‌ వయస్సు చిన్నదైనా మనసు పెద్దదని నిరూపించుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలని కోరారు. తెలంగాణలో సత్సంప్రదాయాలకు బాటలు వేయాలని సూచించారు. అలా కాకుండా అడ్డగోలుగా చట్టాలను దుర్వినియోగం చేస్తున్నట్టేనని తెలిపారు.


ఇదిలాఉండ‌గా,  ఏపీ సీఎం జగన్‌ను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ విలువలు నేర్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ సీపీఐ నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబుకు పట్టిన గతే తెలంగాణలో కేసీఆర్‌కు పడుతుందని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ప్రతిపక్షం అయితే ప్రజలకు ఒరిగేదేం లేదని నారాయణ అభిప్రాయపడ్డారు. నమ్మకంతో గెలిపిస్తే ప్రజలను అమ్మి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమత సర్కార్‌ను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్తున్న సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: